Telangana Rising Global Summit -2025:తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు- సదస్సులో ఏం చర్చించనున్నారంటే?
Telangana Rising Global Summit -2025:డిసెంబర్ 8 అంటే సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమవుతుంది. రెండు రోజులపాటు జరగనుంది.

Telangana Rising Global Summit -2025:తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 కోసం రేవంత్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భారీ సంఖ్యలో విదేశీ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యాపార దిగ్గజాలు వస్తున్న సమ్మిట్‌కు ఎలాంటి అవంతరాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ భవితవ్యాన్ని, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని ప్రపంచ పటంలో సగర్వంగా నిలిపేందుకు ఉద్దేశించిన ఈ సమావేశానికి కేవలం రెండు రోజుల టైం మాత్రమే ఉంది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటో దాదాపు వంద ఎకరాల్లో నిర్మిస్తున్న ప్యూచర్ సిటీలో ఈ గ్లోబల్ సమ్మిట్‌కు ముస్తాబు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రోగ్రామ్‌లో 20247 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రత్యేక విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించబోతున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులతో కూర్చొని తుది మెరుగులు దిద్దుతున్నారు.
40 దేశాల నుంచి ప్రతినిధులు
గ్లోబల్ సమ్మిట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో వివీఐపీలు రానున్నారు. అందుకు తగ్గట్టుగానే అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఆశలతో ఏర్పాటు చేస్తున్న సమ్మిట్‌కు 40కుపైగా దేశాల నుంచి దాదాపు 15వందల మంది విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరిలో చాలా మంది ఐటీ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన వాళ్లు, గూగుల్, అమెజాన్, ఇలా ప్రపంచంలోనే టాప్ కంపెనీల నుంచి వస్తున్నారు. ఫార్మా బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, రంగాలకు చెందిన వాళ్లు కూడా సమావేశానికి హాజరవుతున్నారు. అందుకే ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. ఇందులో పలువురు ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారని చెబుతున్నారు.
రానున్న దిగ్గజాలు
డిసెంబర్ 8 అంటే సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమవుతుంది. ఇందులో బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. బయోకాన్ చైర్‌పర్శన్ కిరణ్ మజుందార్‌షా, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ కె. బెరి, 2025 మిస్‌వ వరల్డ్ సుచతా చువాంగ్ శ్రీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్ మొదటి రోజు వేదికపై కనిపించనున్నారు. వర్చువల్‌గా మైక్రోసాఫ్ట్ ఛైర్మ్ అండ్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, వరల్డ్‌బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బగ్గా లాంటి దిగ్గజాలు సమావేశంలో ప్రసంగిస్తారు. సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, నటులు రితేస్ దేశ్‌ముఖ్, రిషబ్ శెట్టి కూడా వస్తున్నారు.
26 ప్యానల్ డిస్కషన్స్
26 ప్యానల్ డిస్కషన్స్ జరుగుతాయి. ఇందులో కాలుష్యరహిత ఇంధనం, గ్రీన్ మొబిలిటీ, గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తెలంగాణ, ఏరోస్పేస్, డిఫెన్స్, గిగ్ ఎకానమీ, మూసీ నది పునరుద్ధరణ, ఒలింపిక్స్, సాంస్కృతిక, పర్యాటకం లాంటి అంశాలు చాలానే ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ప్రధానమంత్రి ఈ సదస్సుకు రావడం లేదని తెలుస్తోంది. వందేమాతరంపై డిస్కషన్ ఉన్నందున ఎంపీలు కూడా వచ్చేది అనుమానంగానే ఉంది.
వార్ రూమ్‌లో భట్టి
గ్లోబల్ సమ్మిట్‌కు భారీ సంఖ్యలో ప్రతినిధులు వస్తున్నందున కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రజాభవన్‌లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేశారు. దీన్ని సీనియర్ ఐఏఎస్ అధికారులు సబ్యసాచిఘోష్, జయేష్ రంజన, కృష్ణ భాస్కర్ సహా ఐఎస్‌బీ నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పుడు ఏ కార్యక్రమం జరగాలని, ఎలాంటి అంశాలు ప్రస్తావించాలి, ప్రభుత్వ ప్రయార్టీలు ఏంటనే విషయాన్ని చర్చించి పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ వార్ రూమ్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లీడ్ చేస్తున్నారు.
ఆదివారం ట్రయల్ రన్
ఆదివారం నాటికి పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అప్పటికి ఏమైనా లోపాలు తలెత్తితే సరి చేసేందుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సదస్సు జరుగుతున్న ప్యూచర్ సిటీలో భవిష్యత్ ఎలా ఉంటుందో స్పష్టంగా చెబుతోంది ప్రభుత్వం. వంద శాతం అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. నిరంతరాయంగా ఎంత ఇంటర్నెట్ కావాలన్నా అందించబోతోంది. ఒకేసారి పదివేల మంది వైఫై వినియోగించుకునేలా సదుపాయం కల్పించింది. ఇంటర్నెట్ కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకంగా ఎక్కడికక్కడ క్యూఆర్ కోడ్ ఆధారిత లాగిన్స్ సౌకర్యాన్ని సిద్ధం చేసింది.
గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న ప్రాంగణంలో ఎక్కడ కూర్చున్నా సరే కార్యక్రమాలు తెలుసుకునేందుకు వీలుగా భారీ స్థాయిలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లు సిద్ధం చేశారు. మరికొన్ని స్క్రీన్‌లపై తెలంగాణ రైజింగ్‌కు సంబంధించిన సమాచారం కంటిన్యూగా ప్రసారం అవుతుంది. విద్యుత్ కూడా అంతరాయం లేకుండా అందించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సమావేశ పరిసర ప్రాంతాల్లో భూగర్భ కేబుళ్ల ద్వారా నిరంతరాయంగా విద్యుత్ అందిస్తారు. 315 కేవీ సామర్థ్యం ఉన్న మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ సిద్ధంగా ఉంది. ప్రాంగణంలో ఉన్న 8 వేదికల్లో 3,000 టన్నుల సామర్థ్యంతో కూడిన ఏసీ మెషిన్స్ ఫిట్ చేారు. మొత్తంగా సుమారు 5 వేల మంది సమ్మిట్‌కు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.
భద్రత విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. మూడంచెల భద్రత కల్పిస్తున్నారు. వెయ్యికిపైగా సీసీ కెమెరాలు అమర్చి సెంట్రల్ పోలీస్ కంట్రోల్‌రూంకు అటాచ్ చేశారు. లాఅండ్ ఆర్డర్ కోసం 1,500 మంది పోలీసులు, వెయ్యి మంది ట్రాఫిక్ నియంత్రణకే ఉంటారు.





















