(Source: ECI/ABP News/ABP Majha)
Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రి భవనం పనికిరాదు, తేల్చిన కమిటీ!
Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రి భవనం పనికి రాదని నిపుణుల కమిటీ తేల్చింది. ఆస్పత్రి కోసం వాడేందుకు ఏమాత్రం అనువుగా లేదని.. మరమ్మతులు చేసినా ఇతర అవసరాలకు మాత్రమే వాడుకోవచ్చని చెప్పింది.
Osmania Hospital: సుమారు వందేళ్ల చరిత్ర ఉంది ఉస్మానియా ఆస్పత్రి భవనానికి. దాని పెద్ద పెద్ద గుమ్మటాల నిర్మాణం, చాలా పెద్దదైన భవన నిర్మాణం ఆనాటి నైజాముల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తూ వచ్చింది. రోజులు గడిచే కొద్దీ దానిని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. మరమ్మతులకు నోచుకోకపోవడంతో పెచ్చులు, పెల్లలు, గోడలు పడిపోతూ ఉండేవి. వాటర్ లీకేజీలు, సీవరేజీ సమస్యలు నిత్యం వెంటాడుతూ ఉండేవి ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని. దాన్ని కాపాడాలంటూ స్వచ్ఛంద సంస్థలు, పలువురు వ్యక్తులు చేసిన పోరాటం ప్రభుత్వం నిర్లక్ష్యం ముందు ఏపాటి కాలేదు.
నిపుణుల కమిటీ..
ఉస్మానియా భవనం కూల్చి వేసి ఆ స్థలంలో మరో భవనం కడతామని చెబుతూ వస్తోంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం. దానిని కూల్చేస్తామని చెప్పినప్పటి నుండి పలువురు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు ఆ భవనాన్ని కూల్చవద్దని పోరాటం మొదలు పెట్టాయి. హెరిటేజ్ భవనాన్ని ఎలా కూల్చేస్తారని, చరిత్రను పాతిపెట్టడం భావ్యం కాదని నినదించాయి. హైకోర్టును ఆశ్రయించగా... న్యాయస్థానం వారికి అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది.
ఉస్మానియా భవనం పనికి రాదు..
ఎక్స్ పర్ట్ కమిటీ ఉస్మానియా భవనాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేసింది. బల పరీక్షలు నిర్వహించింది. పెచ్చులు, పెలుసులు ఊడిపడుతున్న స్థలాలను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. నీటి పైపులు, సీవరేజీ పైపులు, గ్యాస్ పైపులను పరిశీలించింది. గోడల దృఢత్వంపై పరీక్షించింది. ఇలా అన్ని రకాల పరీక్షలు, తనిఖీలు చేసిన నిపుణుల కమిటీ తాజాగా నివేదిక అందజేసింది. ఉస్మానియా పాత భవనం ఏమాత్రం అనువుగా లేదని, ఆ భవనం శిథిలావస్థకు చేరడంతో పనికిరాదని తేల్చి చెప్పింది.
ఇతర అవసరాలకు ఓకే కానీ ఆస్పత్రికి వద్దు..
ఉస్మానియా భవనం ఆస్పత్రికి పనికిరాదని నిపుణుల కమిటీ మరమ్మతులు నివేదించింది. మరమ్మతులు చేసినా ఆస్పత్రిని కొనసాగించేందుకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చింది. ఆస్పత్రి కాకుండా ఇతర అవసరాలకే వినియోగించుకోవచ్చని చెప్పింది. ఆస్పత్రిగా వాడాలంటే ఆక్సిజన్, మంచి నీరు, సివరేజీ, గ్యాస్ పైప్ లైన్లు వేయాల్సి ఉంటుంది సూచించింది. కానీ అన్ని రకాల మరమ్మతులు చేపడితే భవనం హెరిటేజ్ కట్టడం దెబ్బతింటుందని హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో ఎక్స్ పర్ట్ కమిటీ పేర్కొంది.
నివేదికపై అధ్యయనం తర్వాత విచారణ..
ఉస్మానియా ఆస్పత్రి భవనంపై నిపుణులు ఇచ్చిన నివేదికను హైకోర్టు పరిశీలించింది. అయితే ఈ రిపోర్టును అధ్యయనం చేయడానికి ప్రభుత్వానికి కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ ఏజీ హైకోర్టును కోరారు. ఏజీ అభ్యర్థనను అంగీకరించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం... నివేదికపై అధ్యయనం తర్వాత విచారణ చేపడతామని చెప్పింది. విచారణను వచ్చే నెల ఆగస్టు 25కి వాయిదా వేసింది హైకోర్టు.
వర్షాలతో ఆస్పత్రిలోకి నీళ్లు..
గతేడాది భారీగా కురిసిన వానలతో ఆస్పత్రిలోకి వాన నీరు వచ్చి చేరింది. రోగులున్న వార్డులో నీరు నిలిచిపోయింది. అందులోనే నడుస్తూ వైద్యులు రోగులకు చికిత్స అందించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతోనూ ఉస్మానియా ఆస్పత్రిలోకి నీళ్లు వస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనంలో ఉండేందుకు వైద్యులు, రోగులు జంకుతున్నారు.