(Source: ECI/ABP News/ABP Majha)
వ్యవసాయ మోటార్లకు మీటర్లు, సబ్సిడీల ఎత్తివేత నిజమేనా ? ఎమ్మెల్యే రఘునందన్ రావు క్లారిటీ
సబ్సిడీలు ఎత్తివేస్తున్నారు, కేంద్రం బిల్లుతో మోటార్లకు మీటర్లు వస్తాయని మంత్రులు చెబుతున్నారని, అవన్నీ అబద్ధాలు అని విద్యుత్ సవరణ బిల్లులో ఈ విషయాలు లేవని రఘునందన్ రావు అన్నారు.
సెప్టెంబర్ 15, 2020లో తెలంగాణ అసెంబ్లీ కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లుపై తమ నిర్ణయాన్ని తెలిపిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. నేడు అసెంబ్లీలో విద్యుత్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. టీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మంత్రులు చెబుతున్నవి పచ్చి అబద్ధాలు అని సభలో మాట్లాడారు దుబ్బాక ఎమ్మెల్యే. సబ్సిడీలు ఎత్తివేస్తున్నారు, కేంద్రం బిల్లుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయని పదే పదే మంత్రులు చెబుతున్నారు. 17 ఏప్రిల్ 2020లో సెక్షన్ 65 ప్రకారం .. రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన లేదా, బడుగు, బలహీన వర్గాలకు సబ్సిడీ ఎత్తివేయాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని బిల్లులో లేదు..
2020లో గానీ, 2 ఆగస్టు 2022లో తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎక్కడ పేర్కొనలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. రెండు పర్యాయాలు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లులో.. రైతులకు గానీ, బడుగు బలహీన వర్గాలకుగానీ ఉచితంగా ఇవ్వకూడదని.. సబ్సిడీలు ఎత్తివేయాలని పేర్కొనలేదని క్లారిటీ ఇచ్చారు. కరెంట్ ను 2017లో భారతదేశంలో ఇచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో ప్రణాళికలు తీసుకొచ్చి చాలా గ్రామాల్లో వెలుగు నింపాలన్నారు. 18 వేల గ్రామాల్లో 1000 రోజుల ప్రణాళికతో విద్యుత్ సరఫరా మొదలుపెట్టిందన్నారు.
విద్యుత్ సవరణ బిల్లుపై లఘుచర్చ..
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు - పర్యవసానాలపై లఘు చర్చను టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రారంభించారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఇదే అంశంపై లఘు చర్చను ప్రారంభించారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు లఘుచర్చలో మాట్లాడుతూ.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం, బడుగు, బలహీన వర్గాలకు ఉచిత విద్యుత్ అందించడం లేదా సబ్సిడీలు ఎత్తివేయాలని విద్యుత్ సవరణ బిల్లులో ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పారు.
డబుల్ ఇంజిన్ గ్రోత్ ను మించేలా తెలంగాణ..
శాసన మండలిలో విద్యుత్ సవరణ బిల్లు - పర్యవసానాలపై లఘు చర్చను ఎమ్మెల్సీ మధుసూదనాచారి ప్రారంభించారు. ఒకప్పుడు కరెంటు కనెక్షన్ కోసం పైరవీలు చేయాల్సి వచ్చేదన్నారు. 1935లో తెలంగాణలో పవర్ ప్లాంట్ స్థాపించారని, గతంలో 7,778 మెగావాట్లు సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 17,665 మెగావాట్లుకు పెరిగిందన్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణలో 8 ఏళ్ల పాలనతో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 వేల మెగావాట్ల కెపాసిటీ పెంచుకున్నామని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే యూపీలో కేవలం 665 యూనిట్లు మాత్రమే ఉంటే, తెలంగాణలో వినియోగం 1156 యూనిట్లు ఉందన్నారు మధుసూదనాచారి. దేశ తలసరి వినియోగం కంటే తెలంగాణ వినియోగం ఎక్కువని, ఉమ్మడి ఏపీలో అత్యధికంగా 5600 మెగావాట్లు డిమాండ్ ఉండగా, తెలంగాణలోనే 14,060 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైందని ఎమ్మెల్సీ మధుసూధనాచారి పేర్కొన్నారు.
Also Read: KCR Jagan Friendship : జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వెంటే జగన్ ఉంటారంటున్న తెలంగాణ మంత్రి! పీకే ఇద్దర్నీ కలుపుతున్నారా ?