Mynampally Hanumantha Rao: మరో వివాదంలో ఎమ్మెల్యే మైనంపల్లి, ఆ ఫిర్యాదుపై కలెక్టర్‌కు కీలక ఆదేశాలు
ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఆయన తనతో పాటు తన కుమారుడికి కూడా టికెట్ ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే.
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇటీవల వార్తల్లో ఎక్కువ నిలుస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ అగ్రనేతల్లో ఒకరైన మంత్రి హరీశ్ రావుపై వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అగ్రనేతల గురించి కూడా మాట్లాడిన ఆడియో రికార్డింగ్ లు బయటికి వచ్చాయి. తాను కేసీఆర్, కేటీఆర్ ఎవరికీ భయపడబోనని తేల్చి చెప్పారు. తాజాగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. మైనంపల్లిపై బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్ రాష్ట్ర ఎన్నికల అధికారి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులను ఉపయోగించి మైనంపల్లి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని సాయి ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, సాయి ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని తెలంగాణ డీజీపీ, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఆయన తనతో పాటు తన కుమారుడికి కూడా టికెట్ ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ అందుకు ఒప్పుకోకపోవడంతో ఎమ్మెల్యే రెబల్ గా వ్యవహరిస్తున్నారు. తన అనుచరులతో మాట్లాడి వారం రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. తాజాగా ఆయన చెప్పిన డెడ్ లైన్ నిన్నటితో ముగియగా.. ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
వ్యాఖ్యల తర్వాత కూడా టికెట్ ప్రకటన
అయితే, మైనంపల్లి హనుమంతరావు పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆ తర్వాత కూడా మైనంపల్లికి టిక్కెట్ ప్రకటించారు. ఇప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఏ క్షణమైనా సస్పెండ్ అనే లీకులు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ అభ్యర్థిపై కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. కానీ ఆయన సైలెంట్ గా ఉంటే అంతా సర్దుకుపోతుందని బీఆర్ఎస్‌లోని ఓ వర్గం గట్టి నమ్మకంతో ఉంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం కూడా మైనంపల్లికి వ్యతిరేకంగా పోస్టులు ఆపేసింది.
మైనంపల్లి రెబల్ లీడరే !
గత ఏడాది డిసెంబర్‌లో మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందర్నీ తన నివాసానికి పిలిచారు. మల్లారెడ్డి కారణంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపణలు చేశారు. ఈ అంశం బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ అయింది. కానీ తర్వాత చల్లారిపోయింది. అప్పట్లో మల్లారెడ్డిని టార్గెట్ చేసిన మైనంపల్లి హన్మంతరావు ఇప్పుడు పార్టీలో మరో కీలక అయిన హరీష్ రావును లక్ష్యంగా ఎంచుకున్నారు. హరీష్ రావుపై చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. సిద్దిపేటలోనే ఓడిస్తానని సవాల్ చేశారు. మైనంపల్లి సవాళ్లను చూస్తే... హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారని అర్థం చేసుకోవచ్చు. మైనంపల్లికి, హరీష్ రావుకు పాత గొడవలు ఉన్నాయా అంటే.. లేవనే సమాదానం వస్తుంది. అయినా హరీశ్ రావును మైనంపల్లి టార్గెట్ చేశారు.
బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు మైనంపల్లి తన కుమారుడికి టిక్కెట్ విషయంలో తగ్గే అవకాశం లేదని.. ఆయన పార్టీ మారిపోవడం ఖాయమని కూడా ప్రచారంలో ఉన్నారు. కానీ, ఆయన లాంటి నేతలు వదులుకోవడం ఇష్టం లేని కేసీఆర్.. దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.