Eetala Rajender: "ప్రజా తెలంగాణ కోసం మరో ఉద్యమం అవసరం - ఫ్యూడల్ పాలనకు అంతం పలకాలి"
Eetala Rajender: మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి 103వ జయంతి సందర్భంగా ఈటల రాజేందర్ చెన్నారెడ్డి ఘాట్ కు వెళ్లారు. ఆయన సమాధి వద్ద ఘన నివాళులు అర్పించారు.
Eetala Rajender: మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 103వ జయంతి సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న చెన్నారెడ్డి ఘాట్ కు ఈటల రాజేందర్ వెళ్లారు. ఆయనతో పాటు మర్రి శశిధర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి మర్రి చెన్నారెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మహనీయులు మర్రి చెన్నారెడ్డికి తాను ఘన నివాళులు తెలుపుతున్నట్లు వివరించారు. తెలంగాణ ఉద్యమం మూడు దఫాలుగా సాగిందని గుర్తు చేశారు. 1951-52 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం, మా ఉద్యోగాలు మాకు కావాలని, స్వయం పాలన కావాలని.. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో 1969లో ఉద్యమం కొనసాగిందని తెలిపారు.
నాటి ప్రతీ సంఘటనను తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంది..
ఆనాడు ఇంత సమాచార వ్యవస్థ లేకపోయినప్పటికీ తెలంగాణ 10 జిల్లాల్లో వయసుతో, పార్టీలతో సంబంధం లేకుండా.. తెలంగాణ మట్టి బిడ్డలుగా రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం అకుంఠిత దీక్షతో ఉద్యమం కొనసాగిందని వివరించారు. ఆనాడు ఆ ప్రభుత్వాల తూటాలకు 369 మంది ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డలు అసువులు బాసారని స్పష్టం చేశారు. నాడు జరిగిన ప్రతీ సంఘటనను తెలంగాణ సమాజం ఇప్పటికీ గుర్తు పెట్టుకుందన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా మూడవ దఫా ఉద్యమం కొనసాగిందని, మూడు తరాల ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష 2014లో నెరవేరిందని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. కానీ అమరత్వంతో వచ్చిన తెలంగాణలో.. అమరవీరుల ఆశయాలను నెరవేర్చుకోవాల్సిన క్రమంలో మళ్లీ సమాజాన్ని బానిసత్వంలోకి తీసుకుపోయే పద్ధతి వచ్చిందన్నారు.
అయ్యో.. తెలంగాణ వస్తే ఇలా ఉంటుందా..!
ఫ్యూడల్ మనస్తత్వంతో రాష్ట్రాన్ని నడుపుతున్నారని విమర్శించారు. ఏ ఆత్మగౌరవం కోసం, ఏ ఉద్యోగాల కోసం, ఏ అభివృద్ధి కోసం, తెలంగాణను దేశ చిత్రపటంలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని కొట్లాడేమో అవన్నీ కలలుగానే మిగిలిపోయాయన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత తెలంగాణ వస్తే ఇలా ఉంటుందా అని బాధపడే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరో ఉద్యమం వచ్చే ఆస్కారం ఉంటుందని తెలంగాణ ఉద్యమ సమయంలోనే మాట్లాడినట్లు ఈటల గుర్తు చేశారు. ప్రజల భాగస్వామ్య పాలన కొనసాగాలంటే మరో ఉద్యమం రావాల్సిందేనన్నారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నామని, ప్రజలకు నచ్చిన, ప్రజలకు అనుకూలమైన పాలన అతి తక్కువ కాలంలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ సమాజం ఉన్నంత వరకు ఆయన మన మదిలో ఉంటారు..
ప్రజలు మెచ్చే పరిపాలన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మర్రి చెన్నారెడ్డి ఆనాడు కలలు కన్న.. మనిషిని మనిషి గౌరవించే ప్రజాస్వామిక తెలంగాణ కావాలని కోరారని తెలిపారు. ఆకలి కేకలులేని, ఆత్మగౌరవంతో ఉన్న తెలంగాణ కావాలని కోరారు. తప్పకుండా అది వచ్చి తీరుతుందన్నారు. లేదంటే రాబోయే కాలంలో ప్రజలు నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నామన్నారు. మర్రి చెన్నారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఆయన మన మధ్య లేకపోయినా తెలంగాణ సమాజం ఉన్నంత వరకు ఆయన మదిలో ఉంటారని ఈటల రాజేందర్ వెల్లడించారు.