Chikoti Praveen Casino Case: క్యాసినో కేసులో ఈడీ దూకుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణకు ఈడీ నోటీసులు
ED serves Notice to TRS MLC L Ramana: క్యాసినో కేసులో ఈడీ దూకుడు పెంచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణతో పాటు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.
ED Issues Notice to TRS MLC L Ramana: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ముమ్మరం చేసింది. రాజకీయ నేతలకు ఈడీ వరుసగా నోటీసులు ఇస్తోంది. ఇదివరకే ఈడీ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని మహేష్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను విచారిస్తోంది. కొన్ని రోజుల కిందట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ వీరికి నోటీసులు జారీ చేసింది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణతో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రేపు, ఎల్లుండి ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది.
తలసాని సోదరులను ప్రశ్నిస్తున్న ఈడీ
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులను ఈడీ ప్రశ్నిస్తోంది. వారికి కొద్ది రోజుల కిందట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. తలసాని సోదరులు మహేష్, ధర్మేందర్ యాదవ్ పలు రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపారాల్లో హవాలా, మనీలాండరింగ్ వంటి వాటికి పాల్పడినట్లుగా ఈడీ అధికారులు అనుమనిస్తున్నారు. వారు క్యాసినో నిర్వహణలోనూ పాలు పంచుకున్నట్లుగా ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అంతే కాకుండా నాలుగైదు రోజుల పాటు ప్రశ్నించింది. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్‌తో లావాదేవీలు నిర్వహించిన వారి వివరాలు ఈడీకి లభించాయని వాటిలో తలసాని సోదరుల లావాదేవీలు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనిపైనే విచారణకు వారిని పిలిచారని చెబుతున్నారు.
క్యాసినో , మనీలాండరింగ్‌లో ఈడీకి ఆధారాలు చిక్కాయా ?
తలసాని మహేష్, ధర్మేందర్ యాదవ్‌లకు ఈడీ నోటీసులు వచ్చినట్లుగా ఇప్పటి వరకూ బయటకు తెలియదు. అయితే మంత్రి తలసాని సోదరులు ఈడీ విచారణకు హాజరైన తర్వాతనే తెలిపింది. మొత్తంగా వారి వ్యాపారాలకు సంబంధించిన నాలుగేళ్ల ఆర్థిక లావాదేవీలను తీసుకుని రావాలని ఈడీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే వీరి వ్యాపారాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు భాగస్వామ్యం ఉందో లేదో స్పష్టత లేదు. మంత్రికి మాత్రం ఈడీ నోటీసులు జారీ కాకపోవడంతో.. ఆయన సోదరుల వ్యవహారంలోనే ఈడీ ప్రశ్నిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
బీజేపీ టార్గెట్ చేస్తుందని హెచ్చరించిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై ఈడీ అధికారులు దాడులు చేసే అవకాశం ఉందని.. ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు.. కీలక నేతలను టార్గెట్ చేస్తారని కేసీఆర్ పార్టీ కార్యవర్గ సమావేశంలో అలర్ట్ చేశారు. ఎవరూ భయపడవద్దని.. ఎదురు తిరగాలని సూచించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన రెండో రోజే తలసాని సోదరులు ఈడీ ఎదుటకు హాజరు కావాల్సి వచ్చింది. ఈ అంశంపై టీఆర్ఎస్ వైపు నుంచి ఎవరూ మాట్లాడటం లేదు. తలసాని సోదరులు తప్పు చేసి ఉంటే.. ఈడీ చూసుకుంటుందని.. వారు టీఆర్ఎస్ కార్యక్రమాల్లో ఎప్పుడూ పాల్గొనలేదని గుర్తు చేస్తున్నారు. అయితే తలసాని కుటుంబం మొత్తం వ్యాపారాలు కలిసే చేస్తుందని.. ఆయననే ఈడీ టార్గెట్ చేసి ఉండవచ్చని టీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
తెలంగాణలో పలువురు టీఆర్ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు
తెలంగాణలో ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. పది రోజుల కిందట టీఆర్ఎస్ నేతలకు చెందిన గ్రానైట్ పరిశ్రమపై పెద్ద ఎత్తున ఈడీ అధికారులు దాడులు చేశారు. అనేక అవకతవలను గుర్తించామని ప్రకటించారు. మనీలాండరింగ్‌కు ఆధారాలు దొరికాయన్నారు. ఈ క్రమంలో.. తలసాని సోదరులను ఈడీ ప్రశ్నించడం ఆసక్తి రేపుతోంది. టీఆర్ఎస్ అధినేత హెచ్చరించినట్లుగా వరుసగా .. ఆ పార్టీ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయన్న దాన్ని ఎక్కువ మంది నమ్ముతున్నారు.