MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ బృందాలు, సాయంత్రం దాకా విచారణ కొనసాగే అవకాశం!
ఇప్పటికే ప్రగతి భవన్‌లో న్యాయ నిపుణులతో పాటు సీఎం కేసీఆర్ తో నోటీసులపై కవిత మాట్లాడారు. ఆయన కుమార్తెకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారణ చేయడానికి సీబీఐ బృందం ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకుంది. ఆమె నివాసంలోనే విచారణ చేసి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. ఈ కేసులో అరెస్టయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో 160 సీఆర్పీసీ కింద సీబీఐ కవితకు నోటీసులను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన కవితను సీబీఐ అధికారులు విచారణ చేయాల్సి ఉంది. కానీ, ఇతర కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉండటంతో 11వ తేదీన అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాచారం ఇచ్చారు.
కవిత ఇంటికి సీబీఐ అధికారులు రెండు టీమ్‌లుగా వచ్చారు. సీబీఐ టీమ్‌లలో మహిళా అధికారులు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి కవితను ఓ సాక్షిగా మాత్రమే విచారణ చేయనున్నారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే ప్రగతి భవన్‌లో న్యాయ నిపుణులతో పాటు సీఎం కేసీఆర్ తో నోటీసులపై కవిత మాట్లాడారు. ఆయన కుమార్తెకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇంటి ఎదుట ఫ్లెక్సీలు
కవిత ఇంటి ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యోధుని కుమార్తె ఎప్పటికీ భయపడబోదనే అర్థం వచ్చేలా ‘డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్’ అని ఫ్లెక్సీలు పెట్టారు.
విచారణ లైవ్ టెలికాస్ట్ చేయాలి - నారాయణ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవితను రాజకీయ కుట్రలో భాగంగా ఇరికించారనే ఆరోపణలు ఉన్నాయని, అందువల్ల ఆమె విచారణను ప్రత్యక్షప్రసారం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు సైతం విచారణను ప్రత్యక్షంగా చూపిస్తుంటే సీబీఐ ఆ పక్రియను ఎందుకు పాటించడంలేదని ప్రశ్నించారు. లైవ్ ద్వారా ప్రసారం చేయడం ద్వారా ప్రతి విషయం పారదర్శకంగా ఉండే అవకాశం ఉందని అన్నారు. గుట్టుచప్పుడు కాకుండా విచారణ జరిగితే బయటికొచ్చాక, ఎవరి వాదన వారు చెప్పుకుంటారని, వినే జనాలు పిచ్చివాళ్లు అవుతారని నారాయణ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు విచారణే లైవ్ పెట్టినప్పుడు, సీబీఐ, ఈడీ విచారణలు ఎందుకు లైవ్ పెట్టకూడదని ప్రశ్నించారు. కాబట్టి, కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించే తీరును ప్రత్యక్ష ప్రసారం చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లుగా కె.నారాయణ ఓ వీడియోను విడుదల చేశారు.