Food Adulteration: కుళ్లిన అల్లం వెల్లుల్లి పేస్టు, మురుగు పక్కనే కూల్‌డ్రింక్స్ తయారీ - భారీగా ఆహార కల్తీ గుర్తింపు!
కాటేదాన్ లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఎలాంటి అనుమతులు లేకుండానే గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ కల్తీ వ్యాపారం జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
Food Adulteration in Hyderabad: హైదరాబాద్‌లో ఆహారాన్ని కల్తీ చేస్తూ మార్కెట్ లో విక్రయిస్తున్న ముఠాల ఆగడాలు ఆగడం లేదు. గతంలో ఎన్నో సార్లు అలాంటివారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకున్నా, డబ్బులకు ఆశపడుతున్న కొందరు ఆహార కల్తీని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు రంగారెడ్డి జిల్లా కాటేదాన్ లో కల్తీ ముఠాను అరెస్ట్ చేశారు. వారు అనుమతులు లేకుండా అల్లం వెల్లుల్లి పేస్టులను విక్రయిస్తున్నారని గుర్తించారు. కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్స్ తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 500 కేజీల నకీల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టన్ను వెల్లుల్లితో పాటు లిటిల్ చాప్స్ పేరుతో అమ్మే మ్యాంగో డ్రింక్ ను కూడా ఎస్ఓటీ సీజ్ చేశారు.
Katedan News: కాటేదాన్ లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఎలాంటి అనుమతులు లేకుండానే గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ కల్తీ వ్యాపారం జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మురికి ప్రాంతంలో కుళ్లి పోయిన అల్లం, వెల్లుల్లితో పేస్టును నిర్వహకులు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. అల్లం వెల్లుల్లి పేస్టు ఘాటుగా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్టులో అసిటిక్ యాసిడ్ తో పాటు ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు. మెషినరీలో కుళ్లి పోయిన అల్లం, వెల్లుల్లితో పాటు వెల్లుల్లి పాయల పొట్టును కూడా కలుపుతూ పేస్ట్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కల్తీ దందా కొనసాగుతోంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పరిశ్రమపై దాడి చేసి అపరిశుభ్రత, మురుగు నీరు, ప్రమాదకరమైన రసాయనిక పదార్థాలను గుర్తించారు. 500 కేజీల అల్లం, వెల్లుల్లి పేస్టు, భారీగా మ్యాంగో కూల్ డ్రింగ్, ప్రమాదకరమైన రసాయనాలు, తెల్లటి పౌడర్, 210 లీటర్ల అసిటిక్ యాసిడ్, 550 కేజీల నాన్ వెజ్ మసాల ప్యాకెట్స్, టన్ను వెల్లుల్లిని సీజ్ చేశారు.
మాదాపూర్‌లో భారీగా మద్యం బాటిళ్లు సీజ్
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ (Madapur PS) పరిధిలోని మస్తాన్ నగర్‌లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి నేతృత్వంలో అడిషనల్ డీసీపీ, ఏసీపీ, 11 సెర్చ్ పార్టీలు, దాదాపు 150 మంది పోలీసు సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇందులో నలుగురు పాత నేరస్తులను గుర్తించగా.. సరైన పత్రాలు లేని నాలుగు వాహనాలు, రెండు బెల్టు షాపులు గుర్తించి 400 కాటన్ల మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. నలుగురు పాత నేరస్తులను గుర్తించి వారి ప్రస్తుతం ఏ కార్యకలాపాలు చేస్తున్నారో ఆరా తీశామని డీసీపీ తెలిపారు. మస్తాన్ నగర్‌లో 11 సెర్చ్ పార్టీలు, 5 కటాఫ్ పార్టీలతో తనిఖీలు చేశామని చెప్పారు. రెండు బెల్టు షాపులు, అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న షాపులను, క్రాకర్స్ నిల్వ ఉంచిన షాపును గుర్తించామని చెప్పారు. 400 కాటన్ బాక్సుల మద్యం బాటిళ్ళు సీజ్ చేసినట్లు తెలియజేశారు.