Hyderabad News: మియాపూర్‌లో 144 సెక్షన్, వెయ్యి మంది పోలీసులతో భారీ భద్రత
Telangana News: మియాపూర్ లోని సర్వే నెంబర్ 100, 101 వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న వందల ఎకరాల స్థలాన్ని కొంత మంది ఆక్రమణకు యత్నిస్తున్నారు.
Hyderabad Miyapur News: హైదరాబాద్ లోని మియాపూర్, చందానగర్‌లో సైబరాబాద్ పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఏకంగా వెయ్యి మంది పోలీసులను మోహరించి భారీ భద్రత ఏర్పాటు చేశారు. మియాపూర్ లోని సర్వే నెంబర్ 100, 101 వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న వందల ఎకరాల స్థలాన్ని కొంత మంది ఆక్రమణకు యత్నిస్తున్నారు. దీంతో పోలీసులు భూమి చుట్టూ ఉన్న రోడ్ల వద్ద బారికెడ్లు ఏర్పాటు చేసి లోపలికి ఎవరిని రానీయడం లేదు.
సదరు భూమి 450 ఎకరాలు ఉంటుందని.. ఈ ప్రభుత్వ భూమి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉందని ఎస్టేట్ ఆఫీసర్ చెబుతున్నారు. కావాలని కొంతమంది వదంతులు సృష్టించి గుడిసెలు వేసుకోవచ్చని వాట్సప్ లలో పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆక్రమించడానికి ఒక వర్గానికి చెందిన ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ ల్యాండ్ మొత్తం గుట్టలతో అడవి లాగ ఉండడంతో ఇంకా కొంతమంది చెట్ల కింద బండరాయిలు కింద తలదాచుకున్నారు. అలాంటి వారిని గుర్తించి పోలీసులు బయటకు పంపించారు.
డ్రోన్ కెమెరాలు సహాయంతో రెండు సర్వే నెంబర్లలో ఉన్న భూమిలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే భూ ఆక్రమణ కేస్ లో 20మంది పై కేసులు నమోదు చేశారు. సంఘటనా స్థలానికి సీపీ అవినాష్ మొహంతి చేరుకుని పర్యవేక్షించారు. ఈనెల 29 వరకూ ఈ ప్రదేశంలో 144 సెక్షన్ ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు.
Hundreds of people gathered to #illegally grab the #HMDA #GovtLand at #Miyapur, #Hyderabad
— Surya Reddy (@jsuryareddy) June 22, 2024
Nearly 2000 people tried to grab govt land at HMT road, after getting a Fake WhatsApp message, that anyone can grab a piece of land.
Huge police deployed to disperse the crowd.#Telangana pic.twitter.com/taICkbz5Sy
‘‘ఘర్షణలను నివారించడానికి, ప్రభుత్వ అధికారుల చట్టపరమైన విధులను నిర్వర్తించే ఏ వ్యక్తిని అడ్డుకోవడానికి, నాకు ఉన్న అధికారాలను ఉపయోగించి, నేను, అవినాష్ మోహంతి, ఐపీఎస్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ సెక్షన్ 144 కింద ఈ కింది ఉత్తర్వులు జారీ చేస్తున్నాను.
a) చెప్పబడిన ప్రాంతాలలో ఐదుగురు (05) లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధించండి.
b) ఆ ప్రాంతంలో సాధారణంగా నివసించని లేదా ఆ ప్రాంతంలో సాధారణంగా పని లేని వ్యక్తులను ఆ ప్రాంతాల సరిహద్దులలో ప్రవేశించకుండా నిషేధించండి.
ఈ ఉత్తర్వులు 23.06.2024 ఉదయం 06:00 గంటల నుండి 29.06.2024 రాత్రి 11:00 గంటల వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ మరియు చందానగర్ పోలీస్ స్టేషన్లలో అమల్లో ఉంటాయి’’ అని సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఏ వ్యక్తినైనా శిక్షార్హులుగా పరిగణిస్తామని సీపీ హెచ్చరించారు.
కింది వ్యక్తులకు ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు
- విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు
- విధి నిర్వహణలో ఉన్న సైనిక సిబ్బంది
- విధి నిర్వహణలో ఉన్న హోంగార్డులు
- అంత్యక్రియల ప్రాసెషన్లు, వివాహ వేడుకలు