Cyberabad Police: పుణె నుంచి Hydకి కరడుగట్టిన దొంగల ముఠా! ఉండేది ఇక్కడే: సైబరాబాద్ పోలీసులు
పుణె నుండి రైలు మార్గంలో వీరు హైదరాబాద్ కు వచ్చి నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో ఉంటున్నట్లుగా సైబరాబాద్ పోలీసులు చెప్పారు.
హైదరాబాద్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు దొంగల ముఠాను ముందుగానే పసిగట్టి నేరాలను అదుపు చేయగలిగారు. పుణెకు చెందిన ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చినట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నగరంలోని బంగారు దుకాణాలను టార్గెట్ గా చేసుకుని వీరు చోరికి పాల్పడేందుకు వచ్చారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దీనికి సంబంధించి స్టీఫెన్ రవీంద్ర, పోలీసు ఉన్నతాధికారులు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పుణె నుంచి వచ్చిన దొంగలను పట్టుకున్నామని చెప్పారు. వారిని మీడియా ఎదుట నిలబెట్టారు.
పుణె నుండి రైలు మార్గంలో వీరు హైదరాబాద్ కు వచ్చి నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో ఉంటున్నట్లుగా పోలీసులు చెప్పారు. లాడ్జ్ లలో షెల్టర్ తీసుకుంటే పోలీసులకు అనుమానం వస్తుందనే ఉద్దేశంతో జీడిమెట్లలోని ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో షెల్టర్ తీసుకున్నారని అన్నారు. వీరు కొన్నాళ్ల క్రితం సంగారెడ్డిలోని గుమ్మడిదల గ్రామంలో ఒక టాటా ఏస్ వాహనాన్ని చోరీ చేశారని చెప్పారు. చోరీకి పాల్పడ్డ తరువాత ఈ టాటా ఏస్ వాహనంలో పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. మహారాష్ట్రలో చోరీకి పాల్పడిన బంగారాన్ని సైబరాబాద్ లో విక్రయించి లక్ష రూపాయలు పొందారని వివరించారు.
దొంగతనాల కోసం ప్రత్యేక పనిముట్లు
దొంగతనాలు చేయడం కోసం నిందితులు తమ వద్ద ప్రత్యేక పనిముట్లను తీసుకువచ్చారని పోలీసులు చెప్పారు. ప్రత్యేకంగా వంచిన, ఓవైపు పదునుగా ఉన్న ఐరన్ రాడ్ లు, తల్వార్‌లు, టోపీలు, తుపాకులు, స్క్రూడ్రైవర్లు, పట్టుకార్లు తదితర సామగ్రిని వీరు వెంట ఉంచుకున్నారని వివరించారు. కొన్ని బంగారు దుకాణాలలో చోరీ చేసేందుకు వీరు రెక్కీ కూడా నిర్వహించారని అన్నారు.
పక్కా సమాచారంతోనే గుర్తింపు
‘‘మాకు పక్క సమాచారం వచ్చింది. నిందితులు ఉన్న ప్రదేశంలో పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అయిదుగురు నిందితులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. ఈ ముఠాపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో మొత్తం 175 కేసులు నమోదయ్యాయి. ఈ కరుడు గట్టిన ముఠాను అరెస్ట్ చెయ్యడంతో నగరంలో సెన్సేషనల్ కేసులు నమోదు కాకుండా అరికట్టగలిగాం. ఈ అయిదుగురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. నిందితుల వద్ద నుండి మూడు కంట్రీ మేడ్ తుపాకులు, ఆరు రౌండ్ల బుల్లెట్‌లు, నగదు, ఐరన్ రాడ్‌లు స్వాధీనం చేసుకొని సీజ్ చేశాం’’ అని పోలీసులు తెలిపారు.