Year Ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం
Look Back Business 2024: పరిశ్రమకు అత్యంత విషాదరక నష్టాల్లో ఒకటి రతన్ టాటా మరణం. ఆయన మరణం భారతీయ వ్యాపార రంగం & వ్యవస్థాపకతలో ఒక శకానికి ముగింపు పలికింది.
Business Visionaries Who Passed Away In 2024: ఈ ఏడాది (2024), భారతదేశం అత్యంత ప్రభావశీల వ్యాపారవేత్తలను కోల్పోయింది. ఆదర్శవంతమైనన సిద్ధాంతాలు, ఈ దేశం కోసం చేసిన సేవలను తర్వాతి తరం కోసం వదిలిపెట్టి ఆ మార్గదర్శులు వెళ్లిపోయారు.
2024లో భారతదేశం కోల్పోయిన ప్రముఖ బిజినెస్ లీడర్స్:
1. ఇండస్ట్రీ టైటన్ 'రతన్ టాటా'
వ్యాపార ప్రపంచానికే కాదు, యావత్ దేశానికి జరిగిన అతి పెద్ద నష్టాల్లో రతన్ టాటా మరణం ఒకటి. టాటా గ్రూప్‌ను గ్లోబల్ ఫోర్స్‌గా మార్చి, అసంఖ్యాక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచారు. నిజమైన నాయకత్వం, లక్ష్యం, దూరదృష్టి అంటే ఏంటో ప్రపంచానికి చూపారు. ఆయన అసమాన వారసత్వం టాటా గ్రూప్‌ను దశాబ్దాల ముందుకు నడిపించింది, పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేసింది, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది.
టాటా గ్రూప్ ఛైర్మన్, 86 ఏళ్ల వయస్సులో, వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య పరిస్థితులతో చికిత్స పొందుతూ అక్టోబర్ 09న కన్నుమూశారు.
తన కార్పొరేట్ విజయాలతో పాటు, రతన్ టాటా భారతదేశ స్టార్టప్ వ్యవస్థకు జవసత్వాలు అందించారు. పేటీఎం, స్నాప్‌డీల్, ఓలా, అర్బన్ కంపెనీ వంటి విజయవంతమైన కంపెనీలకు ప్రారంభ మద్దతుదారుగా & పెట్టుబడిదారుడిగా ఉన్నారు. వివిధ రంగాలలో 40 స్టార్టప్‌లకు ఆయన సపోర్ట్ ఇచ్చారు.
2. ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు శశి రుయా
రుయా కుటుంబానికి చెందిన, ఎస్సార్ గ్రూప్ చైర్మన్ అయిన శశికాంత్ రుయా, దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 81 ఏళ్ల వయసులో నవంబర్ 25న తుదిశ్వాస విడిచారు. తొలి తరం వ్యవస్థాపకుడు & పారిశ్రామికవేత్త అయిన శశి, 1969లో, తన సోదరుడు రవికాంత్ రుయాతో కలిసి ఎస్సార్ గ్రూప్‌నకు పునాది వేశారు. శశి వ్యవస్థాపక ప్రయాణం 1965లో ప్రారంభమైంది. 1969లో, చెన్నై పోర్ట్‌లో ఔటర్ బ్రేక్‌వాటర్‌ను నిర్మించడం కీలక మైలురాయి. ఆయన నాయకత్వంలో, ఎస్సార్ గ్రూప్ ఉక్కు, చమురు శుద్ధి, అన్వేషణ & ఉత్పత్తి, టెలికాం, పవర్, నిర్మాణం వంటి విభిన్న రంగాలలోకి విస్తరించింది, గ్లోబల్ గ్రూప్‌గా ఎలివేట్ అయింది.
3. కామ్లిన్ వ్యవస్థాపకుడు సుభాష్ దండేకర్
ఐకానిక్ స్టేషనరీ బ్రాండ్ కామ్లిన్ వ్యవస్థాపకుడు సుభాష్ దండేకర్ జులై 15న, 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణించే సమయానికి కొకుయో కామ్లిన్ ఛైర్మన్‌గా పని చేస్తున్నారు. 1931లో సుభాష్ దండేకర్ తండ్రి దిగంబర్ దండేకర్ & అతని మేనమామ GP దండేకర్ కలిసి వ్యాపారాన్ని ప్రారంభించారు. 1998లో ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. సుభాష్ దండేకర్ నాయకత్వంలో ఆర్ట్ మెటీరియల్స్, రైటింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఆఫీస్ సామాగ్రి విభాల్లోకి విస్తరించింది.
2005లో, జపనీస్ కంపెనీ కొకుయో క్యామ్లిన్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది, ఇది కొకుయో క్యామ్లిన్‌గా రీబ్రాండింగ్‌కు దారితీసింది.
4. రఘునందన్ శ్రీనివాస్ కామత్, 'ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా'
'ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా ప్రసిద్ధి చెందిన రఘునందన్ శ్రీనివాస్ కామత్, "నేచురల్స్ ఐస్ క్రీమ్" వ్యవస్థాపకుడు. ఈ ఏడాది మే నెలలో 75 సంవత్సరాల వయస్సులో స్వల్ప అనారోగ్యంతో మరణించారు. మంగళూరులో మామిడికాయల వ్యాపారికి జన్మించిన కామత్ ప్రయాణం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ముల్కి అనే చిన్న పట్టణంలో ప్రారంభమైంది. అక్కడ, పండ్ల వ్యాపారంలో తన తండ్రికి సహాయం చేశారు. 14 ఏళ్ళ వయసులో వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించారు, తన సోదరుడి రెస్టరెంట్‌లో పని చేయడానికి ముంబై వెళ్లారు. 1984లో, కామత్ కేవలం నలుగురు ఉద్యోగులు & పన్నెండు రుచులతో ఐస్ క్రీమ్ వ్యాపారంలోకి ప్రవేశించారు. సంకల్పం, కృషి, నాణ్యతతో నేచురల్స్ ఐస్‌క్రీమ్‌ను 15 రాష్ట్రాల్లో 165కి పైగా ఔట్‌లెట్లతో విస్తరించారు. ప్రజలు మెచ్చిన బ్రాండ్‌గా మార్చి, సుమారు రూ. 300 కోట్ల టర్నోవర్‌కు చేర్చారు.
మరో ఆసక్తికర కథనం: ఈ రోజు 24K, 22K గోల్డ్ రేట్లలో మార్పులు - తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి కొత్త ధరలు ఇవే