Canada Job Scam: 38 మందిని మోసం చేసిన ఘనుడు, రూ.2.9 కోట్లు టోకరా
Canada Job Scam: కొందరి అవసరం, అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని లక్షలు కాజేస్తున్నారు.
Canada Job Scam: కొందరి అవసరం, అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని లక్షలు కాజేస్తున్నారు. ఇతర దేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ, మంచి భవిష్యత్ ఉంటుందని నమ్మించి కోట్లకు కోట్లు కాజేస్తున్నారు. ఇలాగే కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు కొందరు నిరుద్యోగుల నుంచి రూ.2.9 కోట్లు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్‌లో కేసు నమోదయ్యింది.
పోలీసుల వివరాల మేరకు.. భాగ్యనగరం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో మదస్ కుమార్ అనే వ్యక్తి కొంతకాలంగా రియాన్ వీసా ఇమ్మిగ్రేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశాడు. వివిధ దేశాలకు వెళ్లేందుకు వీసాలు ఇప్పిస్తామంటూ ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. వాటిని చూసి గండిపేట నివాసి జగన్నాథ్ రామ్ లక్డీకాపూల్‌లో ఉన్న కన్సల్టెన్సీని సంప్రదించాడు. కెనడాలో ఉద్యోగం కావాలంటూ అడిగాడు.
కన్సల్టెన్సీ నిర్వాహకుడు మదస్ కుమార్ స్పందిస్తూ.. కెనడాతో పాటు ఇతర దేశాలకు ఉద్యోగాలు, చదువుకోడానికి వెళ్లేవారికి వీసా ప్రాసెసింగ్ చేస్తానంటూ చెప్పాడు. తాను ఇప్పటికే చాలా మందిని చాలా దేశాల్లో ఉద్యోగాలకు పంపినట్లు నమ్మించాడు. దీనిపై జగన్నాథమ్ స్పందిస్తూ తనకు కెనడాలో ఉద్యోగం చేయాలని ఉందని, ఆదేశంలో ఉద్యోగం ఇప్పించాలని కోరారు. అదే అవకాశంగా తీసుకున్న మదస్ కుమార్.. కెనడాలో ఫుడ్ సూపర్‌వైజర్ ఉద్యోగం ఉందని నమ్మించాడు. తప్పని సరిగా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఇందుకు రూ.15.5 లక్షలు ఖర్చవుతుందంటూ చెప్పాడు.
ఈ క్రమంలో అక్టోబర్, 2022లో జగన్నాథ్ రామ్, మదస్ కుమార్ ఒప్పందం చేసుకున్నారు. వీసా ప్రాసెసింగ్‌లో భాగంగా బాధితుడు తొలుత మదస్ కుమార్‌కు రూ.9 లక్షలు చెల్లించాడు. కొన్నిరోజుల తర్వాత గెల్విన్ ఇంటర్నేషన్ కంపెనీ నుంచి సెక్యూరిటీ పర్సనల్ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందినట్లు ఇన్విటేషన్, కెనడా గవర్నమెంట్ నుంచి లేబర్ మార్కెట్ ఇంఫాక్ట్ అసిస్‌మెంట్ (ఎల్‌ఎంఐఏ)ను తెప్పించి జగన్నాథ్‌కు అందజేశాడు. దీంతో ఒప్పందం మేరకు బాధితుడు ఫిబ్రవరి 2023లో పూర్తి డబ్బును చెల్లించాడు. ఇక వీసా వచ్చేదే ఆలస్యమంటూ జగన్నాథ్ ఎదురు చూడసాగాడు.
అయితే నెలలు గడిచినా వీసా రాలేదు. మదస్ కుమార్‌కు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. దీంతో అసలు కెనడా కంపెనీ నుంచి ఇన్విటేషన్ లెటర్ వచ్చిన మాట వాస్తవమా.? కదా.? అని తెలుకునేందుకు జగన్నాథ్ రామ్ ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఎట్టకేలకు గెల్విన్ ఇంటర్నేషన్ కంపెనీ గురించి తెలుసుకుని అక్కడ అధికారులను ఆరా తీశారు. తన పేరుతో ఎలాంటి రికార్డు లేదని తెలిసి జగన్నాథ్ రామ్ షాక్‌కు గురయ్యాడు. నేరుగా కన్సెల్టెన్సీకి వెళ్లి మదస్ కుమార్‌ను కలిసి నిలదీశాడు.
తాను చెల్లించిన 15.5 లక్షలు తిరిగి ఇవ్వాలంటూ జగన్నాథ్ రామ్ అడిగాడు. డబ్బులు తిరిగి ఇస్తానంటూ ఒప్పుకున్న మదస్‌కుమార్ రోజూ కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నాడు. కానీ డబ్బు మాత్రం ఇవ్వలేదు. దీంతో విరక్తి చెందిన జగన్నాథ్ రామ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మదస్ కుమార్ 38 మందిని ఇదే తరహాలో మోసం చేశాడని పోలీసులు గుర్తించారు. వారి నుంచి ఏకంగా రూ.2.9 కోట్లు మోసం చేసినట్లు తేల్చారు. బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.