CM Revanth Reddy: మాట నిలుపుకున్న సీఎం రేవంత్ రెడ్డి, స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రూ.2 లక్షల సాయం
Telangana CM Revanth Reddy helps Swiggy Food Delivery Boy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నేడు నిలుపుకున్నారు. స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రేవంత్ రెడ్డి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు
Telangana CM Revanth Reddy: క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లతో గత వారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నేడు నిలుపుకున్నారు. 4 నెలల కిందట హైదరాబాద్ (Hyderabad) లో కుక్క తరమడంతో భవనం పై నుంచి పడి మృతి చెందిన స్విగ్గి డెలివరీ బాయ్ (Swiggy Delivery BOy) కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు.
వారం రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక భరోసా..
ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక భరోసా అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షల చెక్ ను శనివారం సచివాలయంలో స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి అందించారు. ఈ నెల 23న గిగ్ వర్కర్స్ తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 4 నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్ అంశాన్ని సీఎం రేవంత్ ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2లక్షలు ఆ కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
కేవలం వారం రోజుల్లో అధికారులు ఆ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. శనివారం బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. గత ప్రభుత్వ హయాంలో చనిపోయిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం రేవంత్ రెడ్డి ఆర్థికసాయం చేయడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
వారికి యాక్సిడెంటల్ పాలసీ..
క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ ప్రకటించారు. దాంతోపాటు వీరికి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) హామీ ఇచ్చారు. టీ హబ్ ద్వారా ఒక యాప్
అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
గత శనివారం (డిసెంబర్ 23న)) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన.. వారు లేవనెత్తిన అంశాలనుం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్థాన్ లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్ధవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. సామాజిక రక్షణ కల్పించడంలో మా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.