Telangana: సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ - డిసెంబర్ 9 నాటికి పూర్తి చేసేలా పనులు
Telangana : తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Hyderabad: తెలంగాణ సచివాలయంలో డిసెంబర్ 9 నాటికి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ భూమి పూజ నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రక్రియ చేపట్టారు. వేదమంత్రాలుగా సాక్షింగా 11 గంటలకు రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, అధికారులు పలుమార్లు చర్చించి సచివాలయంలో పోర్టికోకు ఎదురుగా విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించారు. మెయిన్ గేట్ నుంచి భవనం లోపలకు వెళ్ళే క్రమంలో అందరికీ కనిపించేలా దాన్ని రూపొందిస్తున్నారు. అక్కడే ఇవాళ భూమి పూజ జరిగింది.
దీన్ని శరవేగంగా డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయాలి ప్రభుత్వం సంకల్పించింది. 2009లో డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోమంత్రి చిదంబరం తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించారు. అందుకే ఆ తేదీన విగ్రహావిష్కరణ చేయాలని నిర్ణయించారు.
జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ఆర్టిస్టులు, తెలంగాణకు చెందిన కళాకారులు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాలను పరిశీలించిన తర్వాత ఫైనల్ విగ్రహాన్ని ఖరారు చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఉంటుందంటున్నారు. విగ్రహం తెలంగాణ సంస్కృతి చాటి చెప్పేలా ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ ప్రజల దయాగుణం, త్యాగనిరత, మహిళల రూపం అన్నీ కలిసేలా రూపొందించనున్నారు.
దసరా వరకు మంచిరోజులు లేవని వేదపండితులు చెప్పడంతోనే ఇప్పుడు హడావుడిగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఉండదని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారన్నారు. సోనియమ్మ మాట ఇస్తే అది శిలాశాసనమని తెలంగామ రాష్ట్ర ఏర్పాటు నిరూపిచిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని గుర్తు చేశారు.
పదేళ్లు పరిపాలన చేసిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని విమర్శించారు. నేనే తెలంగాణ.. తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించారని ధ్వజమెత్తారు. ప్రజాప్రభుత్వం అలాంటి విధానాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. సచివాలయం తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు గుండెకాయలాంటిదని అందుకే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గత పాలకులు పదేళ్లు సచివాలయంలోకి ప్రజలకు ప్రవేశం కల్పించలేదని తెలిపారు. అదే కాకుండా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు వారికి మనసు రాలేదని ఆరోపించారు.
ట్యాంక్ బండ్ నలువైపులా ఎంతో మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం లేకపోవడం లోటుగా కనిపించిందని అభిప్రాయపడ్డారు. మేధావుల సూచన మేరకే సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీన్ని వివాదం చేసేందుకే తెలంగాణ తల్లి విగ్రహంతో ముడి పెట్టారని ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉండి వాళ్లు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు.
సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని తామూు గతంలోనే ప్రకటించామని వివరించారు రేవంత్ రెడ్డి. కన్నతల్లిని తపించేలా, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి ఉండాలన్నది తమ అభిమతమని పేర్కొన్నారు. విగ్రహం రూపొందించే బాధ్యతను జేఎన్ టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి అప్పగించామని ప్రకటించారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నామని... వేల మందితో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఇది అరుదైన అవకాశమని ఇందులో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు రేవంత్.
Also Read: కవిత బెయిల్ చుట్టూ రాజకీయం - కేటీఆర్ హడావుడే ఈ పరిస్థితికి కారణమా ?