Car Racing Bike Stunts: అనంతగిరి హిల్స్‌పై కారు, బైక్ రేసింగ్‌లు - బెంబేలెత్తిపోయిన సందర్శకులు
Car Racing Bike Stunts: హైదరాబాద్ నగర శివారుల్లో కారు రేసింగ్‌లు స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
Car Racing Bike Stunts: హైదరాబాద్ నగర శివారుల్లో కారు రేసింగ్‌లు స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. కుర్రాళ్లు ఇష్టమొచ్చినట్లుగా కార్లు నడుపుతూ రేసింగ్‌కు పాల్పడుతున్నారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్‌లో కొందరు యువకులు మంగళవారం కార్ రేసింగ్ చేస్తూ రచ్చ చేశారు. ఆగస్టు 15న సెలవు కావడంతో నగరం నుంచి యువత పెద్ద పెద్ద కార్లతో అనంతగిరి హిల్స్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుందా పోలీస్ సైరన్ వేసుకుంటూ కార్లు, బైక్‌లతో రోడ్లపై స్టంట్లు వేస్తూ హల్ చల్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రేసింగ్‌లతో టూరిస్టులను, స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు.
యువత రేసింగ్‌కు పాల్పడుతున్న దృశ్యాలను స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వారాంతాల్లో తరచుగా కార్ రేసింగ్ జరుగుతున్నాయంటూ పోస్ట్ చేశారు. కార్ రేసింగ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రేసింగ్ సమయంలో ఎయిర్ గన్స్ వినియోగిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. రేసింగ్, స్టంట్లకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ పక్కనే ఉన్న వికారాబాద్ కొండలు టూరిస్ట్ ప్రదేశంగా మారింది.
చుట్టూ కొండలు, చిన్న చిన్న జలపాతాలతో ప్రకృతి ప్రేమికులను అలరిస్తుంటాయి. సిటీలో వారం రోజుల పాటు కష్టపడి అలసిపోయిన వారు వారాంతంలో వికారాబాద్ టూరిస్ట్ స్పాట్‌లకు వెళ్లి సేద తీరుతుంటారు. అయితే తాజాగా జరుగుతున్న బైక్, కార్ రేసింగ్ పోటీలతో సందర్శకులు భయపడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరగక ముందే పోలీసులు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. అనంతగిరిలోకి అనుమతిస్తున్న వాహనాల వివరాలు సేకరించడం ద్వారా రేసింగ్‌లకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు. ఇంత జరుగుతున్నా అటవీ అధికారులు, పోలీసులు పట్టించకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెళ్తున్నాయి.
జులైలో నార్సింగి వద్ద రేసింగ్
జూలై 14న సిటీ బయట నార్సింగి వద్ద కొందరు బడా బాబుల కొడుకులు లంబోర్గినీ, ఫెరారీ, ఆడి, మెర్సిడెస్ బెంజ్, ఇన్నోవా కార్లతో రేసింగ్ నిర్వహించారు. నార్సింగి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మధుసూధన్ రెడ్డి కేసు నమోదు చేశారు. నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించగా వారిన చేజ్ చేసి పట్టుకున్నారు. నిందితులందరూ నగరవాసులు అయినప్పటికీ, లంబోర్గినీ, మెర్సిడెస్ బెంజ్ కార్లను మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ చేశారని, ఆడి కారు పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ అయిందని తెలిపారు.
రేసింగ్‌కు పాల్పడిన వాహనాలను సీజ్ చేసి స్థానిక కోర్టుకు పోలీసులు అప్పగించారు. రేసింగ్‌కు ఉపయోగించిన కార్ల జాబితాలో లంబోర్గినీ, ఫెరారీ, ఆడి, మెర్సిడెస్ బెంజ్, రెండు ఇన్నోవాలు ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు చేయడమని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించి ఉదాహరణగా సిటీ రోడ్లపై జరిగిన పలు ప్రమాదాల వీడియోలను సైతం సైబరాబాద్ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. యువత రేసింగ్‌లకు పాల్పడుతూనే ఉన్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial