KTR Hot Comments : కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు- రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్
KTR Comments On Revanth:ఎన్ని ప్రయత్నాలు చేసిన కేసీఆర్‌ను ఎవరూ ఏం చేయలేరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

KTR Comments On Revanth: కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును వేరే దేశాల్లో కట్టిఉంటే గొప్పగా కీర్తించి సత్కారాలు చేసే వాళ్లను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కానీ కుసంస్కారం, కుళ్లు రాజకీయాలు ఉన్న భారత్‌లో ఇలాంటివి ఆశించడం అత్యాశే అవుతుందన్నారు. కేసీఆర్‌ను ఎలాగైనా ఇరికించాలన్న కుట్రతో బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగా 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టును ఇలా బద్నా చేసేందుకు కుయక్తులు పన్నారని అన్నారు.
రెండు రోజుల క్రితం హరీష్‌రావు ఇచ్చిన ప్రజంటేషన్ చూసి ఉంటే కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన వచ్చేది అని అన్నారు కేటీఆర్. ఉన్న అనుమానాలు, అపోహలను క్లియర్ చేసేలా ఆ ప్రజంటేషన్ ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును కేబినెట్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. ఒక ప్రాజెక్టు కట్టాలని, ఎంత డబ్బులు పెట్టానలే, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే విషయాలు గురించి ఆలోచించి ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయని అన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను అమలు పరచాల్సింది ప్రభుత్వ యంత్రాంగమని తెలిపారు. ఇందులో దాచడానికి దాపరికం ఏం లేదన్నారు.
ఈ దేశంలో మాత్రం ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు మారిపోయిందన్నారు కేటీఆర్. మేడిగడ్డపై ఏదో జరిగిందని ఓ నాయకుడు అంటే అవును జరిగిపోయిందని మరో వ్యక్తి మాట్లాడుతున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాలు ఎక్కువైపోయి బీజేపీ, కాంగ్రెస్ ఒకరినొకరు కాపాడుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు.
#WATCH | Hyderabad | "Rahul Gandhi and BJP are together in this. Kaleshwaram is such a project that has over 100 components. The entire system is intact... In over 100 components, there is one barrage, and out of 85 pillars in that barrage, two are damaged. And that too, I think,… pic.twitter.com/8nam1WA4qf
— ANI (@ANI) June 11, 2025
కాళేశ్వరం వల్ల జరిగిన మంచి ప్రజలకు తెలుసన్నారు కేటీఆర్. ఎంత విస్తీర్ణంలో వ్యవసాయం జరిగిందో లెక్కలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఎంత దిగుబడి వచ్చిందో కూడా ప్రజలకు బాగా తెలుసు అన్నారు. ఇదంతా మంత్రివర్గ నిర్ణయమని ఈటల రాజేందర్ కూడా చెప్పారని గుర్తు చేశారు. ఈ నిర్ణయంలో ప్రతి మంత్రి భాగమై ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు.
ఇంత ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేసిన వ్యక్తిగా కేసీఆర్‌కు వేరే దేశాల్లో అయితే పురస్కారం ఇచ్చే వాళ్లు అని అన్నారు కేటీఆర్. భారత దేశంలో ఈ మధ్య నాలుగేళ్ల కాలంలో ఇలాంటి ప్రాజెక్టును పూర్తి చేసిన ప్రాజెక్టు ఆసాధ్యమన్నారు. నర్మదా, బాక్రానంగల్, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు దశాబ్ధాలు కట్టారని గుర్తు చేశారు. కానీ అద్భుతం చేసిన కేసీఆర్‌కు కమిషన్లు, నోటీసులు, విచారణ పేరుతో వేధింపులు లభిస్తున్నాయని అన్నారు.
రేవంత్ రెడ్డి తనకు పిల్లను ఇచ్చిన మామ దగ్గర కూర్చొని నేర్చుకుంటే మంచిదన్నారు కేటీఆర్. ఐదు నిమిషాలు కూర్చొని బుద్దీ జ్ఞానం తెచ్చుకుంటే బెటర్ అన్నారు. 94వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అని తెలివితక్కువోడే అంటారనే మాటలు గుర్తు చేశారు. ఆ తెలివి తక్కువ వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. వంద కంపోనెట్స్ ఈ ప్రాజెక్టులో ఉంటే కేవలం మేడిగడ్డ వద్ద జరిగిన రెండు పిల్లర్లు పగుళ్లు వచ్చిందన్నారు. ఇది కూడా కాంగ్రెస్ నాయకుల ఏదో చిల్లర పని చేసి ఉంటారని సంచలన ఆరోపణలు చేశారు.
ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు కేటీఆర్. కచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్టు వెల్లడించారు. రేపు ప్రజాకోర్టుల్లో ఈ పార్టీలకు శిక్ష పడుతుందని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి లాంటి చిల్లరగాడి వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. కేసీఆర్ వెంట్రుక కడా పీకలేరని ఘాటుగా మాట్లాడారు. రేవంత్ గురువునే రాష్ట్రం నుంచి తరిమేసిన చరిత్ర కేసీఆర్‌ది అని చంద్రబాబు అంశాన్ని ప్రస్తావించారు. కచ్చితంగా రేవంత్ రెడ్డికి అలాంటి గతే పడుతుందని హెచ్చరించారు.





















