KCR Nanded Meeting: నాందేడ్ బీఆర్ఎస్ సభలో అంబేద్కర్, మరాఠా యోధులకు సీఎం కేసీఆర్ ఘన నివాళి
నాందేడ్ లో బీఆర్ఎస్ సభా వేదికపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మరఠా యోధులకు సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు.
BRS Nanded Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో భాగంగా నేడు మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు, కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు నాందేడ్ లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం నాందేడ్ జిల్లా కేంద్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. అనంతరం కేసీఆర్ నాందేడ్ లోని చారిత్రక గురుద్వారాను సందర్శించారు. గురుద్వారాకు వెళ్లిన సీఎం కేసీఆర్‌కు సిక్కు మతగ గురువులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గురుద్వారాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎం కేసీఆర్ గురుద్వారా వద్ద సిక్కు మత గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడి నుంచి నాందేడ్ లో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
అంబేద్కర్, మరాఠా యోధులకు సీఎం కేసీఆర్ నివాళులు
నాందేడ్ లో బీఆర్ఎస్ సభా వేదికపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మరఠా యోధులకు సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. మహానుభావులకు కేసీఆర్ తో పాటు నేతలు నివాళులర్పించారు. మహిళల విద్యాభ్యున్నతికి కృషి చేసిన అన్న బావుసాట్, అహల్యబాయి హోవల్కర్, మరఠ్వాడ పోరాట యోధులు చత్రపతి శివాజీ, లోకమాన్య తిలక్, రాణా ప్రతాప్, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నివాళులర్పించారు.
గులాబీమయమైన నాందేడ్ పట్టణం
ఇటీవల ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఒడిశా రాష్రామానికి చెందిన పలువురు కీలక నాయకులు బిఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మాహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలో పలువురు ముఖ్యులు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున ఆదివారం సీఎం కేసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ సభకు నాందేడ్ పట్టణం వేదికగా మారింది. సభస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణంతో పాటు సభస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మహారాష్ట్రలోని నాందేడ్ లో ఆదివారం జరపతలపెట్టిన బీఆర్‌ఎస్ సభకు ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ సీఎం కేసీఆర్ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ , ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, తదితర నేతలు గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.