KTR: కాంగ్రెస్ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందని యువకులు చెబితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా- అసెంబ్లీలో కేటీఆర్ సవాల్
Telangana Assembly Sessions: ప్రభుత్వం ఉద్యోగాలపై తెలంగాణ శాసన సభలో వాడీవేడీ చర్చ సాగింది. ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందని తెలంగాణ యువకులు చెబితే రాజీనామాకు సిద్ధమన్నారు కేటీఆర్.
KTR Vs Revanth: కాంగ్రెస్ హయాంలో ఒక్క ఉద్యోగం ఇచ్చిందని తెలంగాణ యువకులు చెబితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలు చెబుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగాలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు... తెలంగాణ యువకులతో చెప్పిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం గాలి మాటలే చెబుతుంది కానీ ఇంత వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా నియామకమైన వారిని తమ ఖాతాల్లో వేసుకున్నారని ఆరోపించారు. కేవలం అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చినమంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదన్నారు కేటీఆర్.
ఓపికతో ఉండాలని సీతక్క సూచన
ఆరు గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ ఓపికతో ఉండాలని కేటీఆర్‌కు సూచించారు మంత్రి సీతక్క. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఏం చెప్పాలో అర్థంకాక బీఆర్ఎస్ చర్చను పక్కదారిపట్టిస్తుందని విమర్శించారు. ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని ఓపిక పట్టాలని సూచించారు. పదేళ్లలో అధికారంలో ఉండి కూడా బీఆర్‌ఎస్ ఎందుకు ఉద్యోగాలివ్వలేదని నిలదీశారు. బీఆర్ఎస్ వేధింపులు భరించలేకే ప్రజలు కాంగ్రెస్‌కు అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ రైతురుణమాఫీ చేయలేదని ఆరోపించారు. తాము ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నామని గుర్తు చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క హామీని పూర్తి చేస్తూ వస్తున్నామని అన్నారు.
అనంతరం మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు గత పదేళ్లలో బీఆర్ఎస్ మేనిఫేస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన మొదటి బడ్జెట్‌కే బీఆర్ఎస్ బయపడి హాహాకారాలు చేస్తున్నారని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మాటతప్పారో లేదో అని సుదీర్ఘ ప్రసంగాలు లేకుండా సూటిగా సమాధానం చెప్పాలని సూచించారు.