BRS Leaders : ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ పోరుబాట- బస్సెక్కిన కేటీఆర్, హరీష్- ప్రభుత్వానికి అల్టిమేటం
BRS Leaders Fight on RTC Charges Hike : ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ పోరుబాటు పట్టింది. బస్‌లలో ప్రయాణించిన గులాబీ నేతలు బస్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.

BRS Leaders Fight on RTC Charges Hike: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపును బీఆర్‌ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పేరుతో కుటుంబంపై పెను భారం మోపుతున్నారని, ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని నేతలు ఆరోపించారు. ఛార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్‌ఎస్ నేతలు బస్ భవన్ ముట్టడికి యత్నించారు. అయితే కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయినప్పటికీ కేటీఆర్, హరీష్, సహా కొద్ది మంది నేతలు ఆర్టీసీ బస్‌లలో ప్రయాణించి బస్‌భవన్‌కు చేరుకున్నారు. అక్కడ ఎండీని కలిసి వినతి పత్రం అందజేశారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ మార్గం నుంచి , మాజీ మంత్రి హరీష్‌రావు మెహదీపట్నం నుంచి , పద్మారావుగౌడ్ ఇంకో పక్క నుంచి బస్‌లు ఎక్కి బస్ భవన్‌కు చేరుకున్నారు. ఆయా ప్రాంతాల నుంచి టికెట్ తీసుకున్న నేతలు ప్రభుత్వం తీసుకున్న ఛార్జీల పెంపు నిర్ణయంతో ఒక్కో కుటుంబంపై నెలకు వెయ్యి రూపాయల వరకు భారం పడుతుందని అన్నారు. మహిళలకు ఉచితం అంటూనే మిగతా వారి నుంచి భారీగా వసూలు చేస్తున్నారని అన్నారు. ఇది సరికాదని ఆర్టీసీ నష్టాల్లో ఉంటే కచ్చితంగా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు. దీనికి ప్రజలపై భారం వేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి బస్ భవన వద్దకు బీఆర్‌ఎస్ నేతలు చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు నేతలు యత్నించారు. అప్పటికే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నియంత్రించారు. నేతలతో అధికారులు చర్చించి కేవం నలుగురిని మాత్రమే ఎండీతో సమావేశమయ్యేందుకు అంగీకరించారు. దీనికి బీఆర్‌ఎస్‌నేతలు కూడా ఓకే చెప్పారు. పోలీసుల సూచన మేరకు కేటీఆర్, హరీష్‌రావు, పద్మారావు గౌడ్ ఎండీని కలిశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు, ప్రైవేటీకరణ ఆరోపణలు, ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బకాయిలు ఇతర సమస్యలపై చర్చించారు.
బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ నేతలు మీడియాతో మాట్లారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని కోసం ఎంత దూరమైన వెళ్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే ఐదారుసార్లు బస్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. ఓవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రజలపై భారాన్ని మోపుతున్నారని అన్నారు. అంతేకాకుండా ఆర్టీసీ స్థలాలను అమ్మకానికి పెడుతున్నారని మండిపడ్డారు. కొన్నింటిని తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. అన్ని విధాలుగా ఆర్టీసి పూర్తిగా నాశనం చేసి ప్రైవేటుపరం చేయాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు.
ఆర్టీసీ ఆస్తులు తాకట్టు పెడుతున్న ప్రభుత్వం కార్మికులకి కూడా మంచి చేయడం లేదన్నారు బీఆర్‌ఎస్ నేతలు. వారికి రావాల్సిన బకాయిలను ఇంత వరకు ఇవ్వలేదన్నారు. మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా చెల్లించడం లేదని మండిపడ్డారు. అటు ప్రజలు, ఇటు కార్మికులను కలుపుకొని వెళ్లి ఉద్యమిస్తామని వార్నింగ్ ఇచ్చారు.




















