బీఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటి, జూపల్లి సస్పెండ్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావును పార్టీ నుంచి బీఆర్‌ఎస్ సస్పెండ్ చేసింది.
పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావును పార్టీ నుంచి బీఆర్‌ఎస్ సస్పెండ్ చేసింది. ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్, బీఆర్ఎస్ పై పొంగులేటి, జూపల్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఈ ఇద్దరి నాయకులపై పార్టీ తీవ్ర నిర్ణయం తీసుకుంది.
కొన్ని రోజులుగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రభుత్వంపై, బీఆర్‌ఎస్ అధినాయకత్వంపై విమర్శల తుపాకులు ఎక్కుపెట్టి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పార్టీ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిసినప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ అధినాయకత్వానికి పంటికింద రాయిలా మారారు. ఆదివారం కూడా కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మరో అంసతృప్తి బీఆర్‌ఎస్ నేత జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఇద్దర అసంతృప్త సీనియర్ నేతలు ఒకేవేదికపై కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. చాలా కాలం తర్వాత ఇద్దరు ఒకే వేదికపై కనిపించడమే కాదు... బీఆర్‌ఎస్, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు కూడా ఎక్కుపెట్టారు.
ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఇలాంటి చెత్త పాలన దేశానికి అందివ్వాలనే జాతీయ పార్టీ పేరుతో కేసీఆర్ బయల్దేరారని ఆరోపించారు ఇరువురు నేతలు. కుటుంబ స్వార్థానికి రాష్ట్రాన్ని బలి చేశారని... ఇప్పుడు దేశాన్ని కూడా బలి చేసేందుకు సిద్ధమయ్యారంటూ తీవ్ర విమర్శలు చేశారు. హ్యాట్రిక్ విజయం చేయాలని అనుకుంటున్నారని అయితే ఇది సాధ్యమయ్యే పని కాదన్నారు.
పార్టీకి రాజీనామా చేయకుండా కొన్ని నేలల నుంచి ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పొంగులేటి పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఇన్నాళ్లు ఒక్కరే ఈ సమావేశాలు నిర్విహిస్తూ వచ్చారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో అసంతృప్తులను పిలవడం మొదలు పెట్టారు. మొదట జూపల్లి కృష్ణారావును పిలించారు. ఇకపై మరింత మందిని పిలిచే ఛాన్స్ ఉందని గ్రహించిన బీఆర్‌ఎస్ అధినాయకత్వం చర్యలకు ఉపక్రమించింది.
పార్టీపైన, కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన జూపల్లి కృష్ణారావు, పొంగులేటిని బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అందుకే చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది.
ఇద్దరి ప్రయాణం ఎటు?
కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్‌తో జూపల్లికి పడటం లేదు. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో విబేధాలు ఉన్నాయి. 2018లో బీఆర్‌ఎస్ తరఫున జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నుంచి హర్షవర్దన్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచిన హర్షవర్దన్ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి వీరి మధ్య సఖ్యత లేదన్నది పార్టీలో అందరికీ తెలుసు. బహిరంగంగానే ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
హర్షవర్దన్, జూపల్లి మధ్య ఉన్న పొరపొచ్చాలు తగ్గించేందుకు బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ సెట్ కాలేదు. కాలక్రమంలో అన్నీ సర్దుకుంటాయని పార్టీ భావించినప్పటికీ అలాంటి సూచనలు కనిపించలేదు. కానీ పార్టీలో జూపల్లి ఇన్‌యాక్టివ్ అయ్యారు. కార్యక్రమాలకు దూరంగా జరుగుతూ వచ్చారు. ఇంతలో మొన్నీ మధ్య సిట్టింగ్‌లకే టికెట్లు ఉంటాయని ఓ రివ్యూలో కేసీఆర్ చెప్పడంతో పార్టీపై జూపల్లి అసంతృప్తి మరింత పెంచుకున్నారు.
కొన్ని రోజుల క్రితం పార్టీ మారుతారన్న ఊహాగానాలు ఈ ఇద్దరి నాయకులపై వచ్చాయి. పొంగులేటి అయితే కాంగ్రెస్, బీజేపీ, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకత్వాలతో టచ్‌లో ఉన్నారు. అసలు ఆయన ఏ పార్టీలో చేరుతారన్న ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మూడు ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ నిన్న తీసేస్తూ మాట్లాడారు. తాను మాత్రం జాతీయ పార్టీలో చేరతాను అని చెప్పుకొచ్చారు.
జాతీయ పార్టీలోనే చారుతాన్న పొంగులేటి కామెంట్స్ ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచాయి. అసలు ఆ పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీనా లేకుంటే బీజేపీనా అనే చర్చ మొదలైంది. గతంలో ఓసారి ఇదిగో బీజేపీలో చేరిపోతున్నారు.. అదిగో కాంగ్రెస్‌లో చేరిపోతున్నారనే చర్చ నడిచింది. అధినాయకత్వం అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారనే పుకార్లు కూడా వైరల్ అయ్యాయి. కానీ ఇంత వరకు ఏ పార్టీలో చేరుతున్నారో ఆయన చెప్పలేదు.
జూపల్లి కృష్ణారావు స్వతహాగా కాంగ్రెస్ లీడర్. రాష్ట్రవిభజన టైంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన కాంగ్రెస్ నుంచి రావడానికి అప్పట్లో ఆ పార్టీలో ఉన్న డీకే అరుణ కూడా కారణమయ్యారు. ఆమెతో ఉన్న విభేదాలు కారణంగా ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఆయనకు ఉన్న ఆప్షన్లు కాంగ్రెస్, బీజేపీ. అయితే డీకే అరుణ బీజేపీలో ఉన్నందున ఆ పార్టీలో చేరుతారా లేదా అన్నది ఇక్కడ అనుమానించదగ్గ విషయం. తర్వాత తన సొంత ఇంటి లాంటి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ మొదలైంది.