బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన కేంద్రం- త్వరలోనే విశాఖలో స్టీల్ ప్లాంట్ విజయోత్సవ సభ
స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న టీడీపీ, వైసీపీ చేతులు ఎత్తేశాయన్నారు తోట చంద్రశేఖర్. అందుకే కార్మికుల తరఫున బీఆర్‌ఎస్ పోరాడిందని పేర్కన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్‌ఎస్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందన్నారు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. ఏపీలో బీఆర్‌ఎస్ పార్టీకి ఇది తొలి విజయమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి కేటీఆర్ లేఖ రాయడంతో పాటు ఒక అధ్యయన బృందాన్ని కూడా పంపారన్నారు. దెబ్బకు దిగొచ్చిన కేంద్రం ప్రైవేటీకరణ ఆపుతున్నట్టు ప్రకటన చేసిందన్నారు.
స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న టీడీపీ, వైసీపీ చేతులు ఎత్తేశాయన్నారు. ఏపీ ప్రజలకు ఒక్క బీఆర్‌ఎస్ మాత్రమే అండగా నిలబడిందన్నారు. 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' అన్న నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంటును సాధించుకుందామని పిలుపునిచ్చారు తోట. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మొదటి నుంచి కేసీఆర్ వ్యతిరేకంగా ఉన్నారని వివరించారు. ఎంతో మంది త్యాగలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ విలువ ఇప్పుడు మూడు లక్షల కోట్లని... దానిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది జీవిస్తున్నారన్నారు. అలాంటి సంస్థను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఎలా పెట్టనిస్తామని ప్రశ్నించారు తోట.
ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరిస్తే రిజర్వేషన్లు ఎగిరిపోతాయని అన్నారు తోట చంద్రశేఖర్. అందుకే కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. జాతి సంపదను కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లడాన్ని కేసీఆర్ అంగీకరించరన్నారు. ఒక వేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం మొండివైఖరితో ప్రైవేటీకరణ చేసినా.... మళ్ళీ దాన్ని కాపాడుకొని, జాతీయo చేస్తానని కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు.
ఇటీవల 3 రోజులపాటు విశాఖలో పర్యటించి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించినట్టు తెలిపారు తోట. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల తరఫున పోరాటానికి తాము సిద్ధమని ప్రకటించినట్టు వివరించారు. వారికి అండగా నిలబడ్డామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ దెబ్బకే కేంద్ర ఉక్కు సహాయ మంత్రి విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రకటించారన్నారు. బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామని తేల్చి చెప్పారని గుర్తు చేశారు. బైలదిల్లా గనులను విశాఖ స్టీల్ ప్లాంట్, బయ్యారానికి ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ కూడా కేంద్రాన్ని ప్రశ్నించారని తెలిపారు. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా తెలుగు ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు.
ఆర్‌ఐఎన్‌ఎల్ విలువ 3 లక్షల కోట్ల రూపాయలు అయితే వాళ్ళు చూపించింది మాత్రం రూ.397 కోట్లేనని ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు తోట. అదాని ఇంకా స్టీల్ ప్లాంట్ పెట్టకముందే బైలదిల్లా గనులను కట్టబెట్టారని విమర్శించారు. బైలదిల్లా గనులను అదానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వెంటనే గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఆదేశాలతో కేంద్రం మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన ఇప్పించగలిగామన్నారు తోట చంద్రశేఖర్. 'వైజాగ్ స్టీల్ ప్లాంట్' ను ప్రైవేటీకరించబోమని వెంటనే కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. RINLకు సొంత గనులు కేటాయించాలన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సంబంధించిన 20 వేల ఎకరాల భూములను రాష్ట్రపతి పేరు మీద ఉన్నాయని... వాటిని వెంటనే RINL మీద ట్రాన్స్ఫర్ చేయాలన్నారు. RINL కు రూ.5 వేల కోట్లు తక్షణ సాయం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సొంతకాళ్ళ మీద నిలబడేలా ఆదుకోవాలని సూచించారు.
ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్‌కు ఆర్థికసాయం, వైజాగ్ రైల్వే జోన్, వైజాగ్ మెట్రో, దుగరాజపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ సహా విభన హామీలను నేటికీ నెరవేర్చలేదని వాటిపై కూడా పోరాడతామన్నారు తోట చంద్రశేఖర్. వీటిపై మాట్లాడాల్సిన పార్టీలు.. బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేయడం మండిపడ్డార. ఏపీ విషయంలో మంత్రి హరీష్ రావు అన్నీ నిజాలే మాట్లాడారన్నారు. ఏపీ మంత్రుల దగ్గర సబ్జెక్ట్, సరకు లేకనే హరీష్ రావుపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ సహా అన్ని అంశాలపై మంత్రి హరీష్ రావు వాస్తవాలే మాట్లాడారని సమర్థించారు తోట చంద్రశేఖర్. ఆంధ్ర ప్రజలు తమ సమస్యలను తీర్చగలగే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారని ఆ నాయకుడే కేసీఆర్ అని అభిప్రాయపడ్డారు. దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని... కేసీఆర్, కేటీఆర్ విజన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముగ్ధులవుతున్నారని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌ను ఆంధ్రాకి తీసుకురావాల్సిందిగా అక్కడి ప్రజలు తనను కోరుతున్నట్టు పేర్కొన్నారు.
విశాఖపట్నంలో త్వరలోనే బీఆర్ఎస్ తరఫున భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు తోట చంద్రశేఖర్. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడినందుకుగాను, ఉద్యోగులు, కార్మిక సంఘాలు అక్కడ విజయోత్సవ సభ నిర్వహించాల్సిందిగా అడుగుతున్నారని తెలిపారు.