Bomb Threat To Telangana CMO: తెలంగాణ సీఎంవో, లోక్ భవన్ లకు బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సైతం వార్నింగ్
తెలంగాణ సీఎంవో, లోక్ భవన్ లకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఓవైపు తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరుగుతుంటే మరోవైపు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. పేల్చివేత ప్లాన్ చేన్నారని ఈమెయిల్ చేశాడు.

Telangana Lok Bhavan | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో), లోక్ భవన్ (రాజ్ భవన్) లను పేల్చడానికి కుట్ర జరుగుతోందని పేర్కొంటూ అగంతకుడు గవర్నర్ కార్యాలయానికి ఈమెయిల్ పంపాడు. 'వాసుకి ఖాన్' అనే పేరుతో వచ్చిన ఈ బెదిరింపు మెయిల్‌లో, వెంటనే వీఐపీలను, ప్రముఖులను ఆ భవనాల నుంచి ఖాళీ చేయించాలని బెదిరించినట్లు సమాచారం. ఈ మెయిల్ అందిన వెంటనే గవర్నర్ కార్యాలయం అప్రమత్తమైంది.
గవర్నర్ కార్యాలయ సీఎస్ఓ శ్రీనివాస్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ సిఎస్ఓ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు ఆ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది, దాన్ని ఎవరు పంపారు అనే దానిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
బెదిరింపు మెయిల్స్‌పై చట్టం
ఇలాంటి బెదిరింపు మెయిల్స్ లేదా ఫేక్ కాల్స్ చేసిన వారిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడతారు. తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం (IPC 505), తప్పుడు సమాచారం ఇవ్వడం (IPC 182), నేరపూరిత బెదిరింపులు (IPC 506) వంటి సెక్షన్లను వర్తింపజేస్తారు. ప్రభుత్వ భవనాలు, ముఖ్యంగా సీఎం ఆఫీస్ వంటి వీవీఐపీ ప్రాంతాలకు బెదిరింపులు రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమై రంగంలోకి దిగుతారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు బెదిరింపు.. మిలియన్ డాలర్లు డిమాండ్
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానాల్లో బాంబు ఉందని, దానిని పేల్చకుండా ఉండాలంటే భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని బెదిరింపుకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
అమెరికా నుంచి బెదిరింపులు
ఈ బాంబు బెదిరింపు మెయిల్‌ను 'జాస్పర్ పకార్ట్' అనే వ్యక్తి (అమెరికా, న్యూయార్క్) పంపినట్టు అధికారులు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు అమర్చామని, ఆ విమానాలు టేకాఫ్ అయిన పది నిమిషాల్లో బాంబు పేలుతుందని అగంతకుడు బెదిరించాడు. ఈ పేలుడు జరగకూడదంటే ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8.3 కోట్లు) ఇవ్వాలని బెదిరింపు మెయిల్‌లో డిమాండ్ చేశాడు.
ఈ మెయిల్ అందిన వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లోని అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా అమెరికాకు వెళ్లాల్సిన విమానాల్లో భద్రతా తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం భద్రతా సిబ్బంది, బాంబు స్క్వాడ్ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి.






















