Bandi Sanjay: బండి సంజయ్ పై మహిళా కమిషన్ సీరియస్! బీజేపీ ఎంపీ రియాక్షన్ ఏంటంటే!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనను విచారణకు నోటీసులు పంపగా, నేడు ఆయన విచారణకు హాజరై పలు విషయాలు వెల్లడించారు.
BJP MP Bandi Sanjay: హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నేడు రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనను విచారణకు నోటీసులు పంపగా, నేడు ఆయన విచారణకు హాజరై పలు విషయాలు వెల్లడించారు. అయితే ఎంపీ బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయిందని కొన్ని మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని బండి సంజయ్ ఖండించారు. ఓ ప్రకటన విడుదల చేస్తూ విచారణకు సంబంధించిన వివరాలు ఓ ప్రకటనలో వెల్లడించారు.
- నాపై రాష్ట్ర మహిళ కమిషన్ సీరియస్ అయ్యిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.
- సమాజానికి మంచి జరిగే విషయాలు లీక్ ఇస్తే తప్పులేదు... కానీ అందుకు భిన్నంగా లీకుల పేరుతో ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదు.
- నా విషయంలో మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లుగా నేను భావించడం లేదు.
- మీడియాకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషనే వివరణ ఇవ్వాలి.
- రాజ్యాంగబద్దంగా స్వతంత్య్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై నాకు గౌరవం ఉంది.
- ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతోనే మహిళా కమిషన్ పిలవగానే హాజరయ్యాను.
- మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చాను.
- నా స్టేట్ మెంట్ ను మహిళా కమిషన్ రికార్డు చేసింది.
- మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సుహ్రుద్బావ వాతావరణంలో జవాబిచ్చాను అని బండి సంజయ్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
బీజేపీ మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ అని, కమిషన్ నోటీసులను గౌరవించి తాను విచారణకు హాజరైనట్లు బండి సంజయ్ చెప్పారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు తాను పూర్తి సమాధానం చెప్పానని, తెలంగాణలో వాడే వాడుక పదాలు మాత్రమే వాడానన్నారు. మహిళల్ని కించపరచలేదని, ఎమ్మెల్సీ కవితపై ఉద్దేశపూర్వకంగా ఏ వ్యాఖ్యలు చేయలేదని, కేవలం ప్రజలు మాట్లాడే వాడుక పదాలే వినియోగించానని స్పష్టం చేశారు. కుక్క పిల్లల నుంచి ప్రజల్ని కాపాడలేకపోతున్నారని మంత్రి కేటీఆర్ ను విమర్శించారు. కేటీఆర్ చెప్పివన్నీ రాజ్యాంగ బద్ద సంస్థలు అయిపోతాయా, విచారణ సంస్థలు తమ పనిని చేసుకుపోతాయని ఎవరూ జోక్యం చేసుకోరన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అభ్యర్థులు నష్టపోయాక, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నాక స్పందించడం తప్ప కేటీఆర్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. పేపర్ల లీకేజీలో బీఆర్ఎస్ తప్పు లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి ఎందుకు భయపడుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై 354, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు కేంద్ర మహిళా కమిషన్ ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. కేసును సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ ఈ నెల 13న హాజరవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే పార్లమెంటు సమావేశాల కారణంగా 18న హాజరవుతానని ఆయన కమిషన్‌ను కోరారు. ఆ మేరకు హాజరయ్యారు.