Revanth Reddy: భగవద్గీత స్ఫూర్తితోనే హైడ్రా కూల్చివేతలు - రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Hyderabad News: హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్వహిస్తున్న అనంత శేష స్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన కూల్చివేతలపై మాట్లాడారు.
Revanth Reddy in hare Krishna Heritage Tower: హైదరాబాద్ లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతల పరంపరపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడి భగవద్గీత స్ఫూర్తిగానే హైదరాబాద్ లో కూల్చివేతలు చేపడుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదని చాటిన కృష్ణుడి మాటలే తనకు స్ఫూర్తి అని రేవంత్ చెప్పారు. హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్వహిస్తున్న అనంత శేష స్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన కూల్చివేతలపై మాట్లాడారు. హైదరాబాద్ లో గతంలో ఎన్నో చెరువులు ఉండేవని అన్నారు. చెరువులను చెరబట్టిన వాళ్ల నుంచి విముక్తి చేయాలనుకున్నామని.. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నామని చెప్పారు. కొంత మంది శ్రీమంతులు చెరువులు ఆక్రమించి భవనాలు కట్టుకున్నారని అన్నారు. వారి కారణంగా హైదరాబాద్ లో జనజీవనానికి ఇబ్బంది కలుగుతోందని చెప్పారు.
నగరంలో చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుందని అన్నారు. గతంలో చెన్నైలో వచ్చిన వరదలు.. వయనాడ్ లో విలయాలు అందుకు నిదర్శనం అని అన్నారు. అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండవచ్చని.. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. చెరువుల్లో ఫామ్‌హౌస్‌లు కట్టించుకున్న శ్రీమంతుల ఇళ్ల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు చెరువుల్లో కలుపుతున్నారని అన్నారు. చెరువులు మన జీవనాధారం, సంస్కృతి అని.. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రేవంత్‌రెడ్డి చెప్పారు.
జీవితంలోనే అరుదైన ఛాన్స్
‘‘జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశం వస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నా జన్మ సుకృతం.. కాంక్రీట్ జంగిల్ లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించేందుకు ఇక్కడ హెరిటేజ్ టవర్ నిర్మిచడం గొప్ప విషయం. ఈ టవర్ 430 అడుగుల ఎత్తు నిర్మితం కావడం రాష్ట్రానికి గర్వకారణం. 36 లేదా 40 నెలల్లో ఈ టవర్ నిర్మాణం పూర్తి అవుతుంది.. అది మళ్లీ మనమే ప్రారంభించుకుంటాం.. ఇది చరిత్రలో నిలిచిపోయే గొప్ప సందర్భం.. వందేళ్ల క్రితమే హైదరాబాద్ ను నిజాం లేక్ సిటీగా అభివృద్ధి చేశారు..
కోట్లాది మంది దాహార్తిని తీర్చే చెరువుల పరిధిలో విలాసాల కోసం కొందరు ఫామ్ హౌస్ లు నిర్మించుకున్నారు.
నగరానికి తాగునీరు అందించే గండిపేట్, హిమాయత్ సాగర్ లోకి ఫామ్ హౌస్ ల నుంచి వ్యర్ధజలాలు వదులుతున్నారు. వీటిని ఇలాగే వదిలేస్తే మేము ప్రజా ప్రతినిధులుగా ఉండి వ్యర్ధమే.. అందుకే హైడ్రా ద్వారా... చెరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నాం.. కురుక్షేత్ర యుద్ధం సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్పూర్తితో.. చెరువుల ఆక్రమనలపై మా ప్రభుత్వం యుద్ధం చేస్తుంది.. ఇది రాజకీయాల కోసం, రాజకీయ కక్షల కోసం చేపట్టిన కార్యక్రమం కాదు.. భవిష్యత్ తరాలు బాగుండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం.. ఎవరు ఎన్ని ఒత్తిడులు తెచ్చినా చెరువుల ఆక్రమణదారుల భరతం పడతాం.. ధర్మాన్ని కాపాడాలన్న శ్రీకృష్ణుడి బోధనల స్ఫూర్తిగా మా ప్రభుత్వం ధర్మంవైపు నిలబడుతుంది.
విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు..
ఉస్మానియా, గాంధీ, నిమ్స్, క్యాన్సర్ ఆస్పత్రులల్లో భోజనం అందించేందుకు హరే కృష్ణ ఫౌండేషన్ ను సహకారం కోరుతున్నాం. ఇందుకోసం ప్రభుత్వంవైపు నుంచి మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.