Kavitha on BC Reservations: రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే బీసీ రిజర్వేషన్ల పెంపు, బీజేపీ ఎంపీల ఇండ్లు ముట్టడి: కవిత
Telangana BC JAC Bandh | త్యాగాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్ల బిల్లు నడుచుకుంటూ వస్తదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

BC Reservations In Telangana: హైదరాబాద్ : ‘‘దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ పార్టీలు ఈ బంద్ కు మద్దతు తెలపడం అంటే హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్టు. తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తది. రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే బీసీల రిజర్వేషన్ల (BC Reservations) పెంపు సాధ్యమవుతుంది’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ బీసీ జేఏసీ (Telangana BC JAC) పిలుపునిచ్చిన బంద్ కు కవిత మద్దతు ప్రకటించారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ నాయకులతో కలిసి శనివారం (అక్టోబర్ 18న) ఉదయం ఖైరతాబాద్ చౌరస్తాలో భారీ మానవహారం నిర్మించారు. గంటపాటు ఆందోళన చేసి బీసీలకు మద్దతు తెలిపారు.
బీసీలను కాంగ్రెస్, బీజేపీ మోసం చేస్తున్నాయి..
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ లు పదే పదే మోసానికి పాల్పడుతున్నాయి. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ లు బీసీ బంద్ కు మద్దతు తెలపటం నవ్వులాటలా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ ల తీరు హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్టు అనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్ల పై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్రధాని కాళ్లు పట్టుకొనైనా రిజర్వేషన్లు సాధించాలి. 8 మంది ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తుంది. త్యాగాల ద్వారా తెలంగాణ ఏర్పడింది. అదే విధంగా బీజేపీ ఎంపీల పదవుల త్యాగాలతోనే బీసీ రిజర్వేషన్లకు తొలి అడుగు పడుతుంది. బీజేపీ ఎంపీలు నిర్లక్ష్యం వహిస్తే వారి ఇళ్లను దిగ్భంధిస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా స్వాంతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను మోసం చేస్తుందని’ మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. జనగణన సహా అన్ని అంశాల్లో ఇక్కడి కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తుందని కవిత అన్నారు. ఒకసారి 42 శాతం రిజర్వేషన్లు అని మరోసారి సవరణ అని, మరోసారి జీవో అంటూ మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో టెక్నికల్ గా సరైన వాదనలు వినిపించకపోవటంతోనే కోర్టులలో వ్యతిరేక తీర్పులు వస్తున్నాయన్నారు. జీవో 9 విషయంలో కూడా ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవటంతోనే ఆ జీవోను కోర్టు కొట్టివేసిందన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం మరో ఉద్యమం
బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేపడతామని కవిత అన్నారు. తెలంగాణ బీసీ బిడ్డలు రిజర్వేషన్ల కోసం పంతం పట్టారని చెప్పారు. వారి పంతం దేశంలోని బీసీలందరికీ మేలు జరిగేందుకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సిన అవసరమేముందని కవిత ప్రశ్నించారు. మహారాష్ట్రలో 5 ఏళ్లు, తమిళనాడు లో 10 ఏళ్ల పాటు ఎన్నికలు జరగలేదని... రిజర్వేషన్లు వచ్చాకే అక్కడ ఎన్నికలు నిర్వహించారని గుర్తు చేశారు. బిల్లులు చేయాల్సిన పార్టీలు బంద్ లో పాల్గొనటమేమిటని ప్రశ్నించారు. తమ లాంటి ప్రజాసంఘాలు పోరాటాలు చేస్తాయని... అధికారంలో ఉన్న పార్టీలు చట్టాలు చేయాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లు బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలివిగా మోసానికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఇకనైనా ఈమోసాలను ఆపి... చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లు అమలు చేయించాలని డిమాండ్ చేశారు.

యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్ మాట్లాడుతూ.. బీసీలు రాజ్యాధికారం కోసం 78 ఏళ్లుగా కొట్లాడుతున్నారని.. రాజకీయ పార్టీలు తమను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రపతి బిల్లులు పాస్ చేయకుండా బీజేపీ నాటకాలు ఆడుతుంటే, కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తుందన్నారు. కులగణన చేయకుండా బీఆర్ఎస్ కూడా బీసీలను మోసం చేసిందన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు పోటీగా బీసీలు మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దొంగమాటలు చెప్పే పార్టీలకు బుద్ధిచెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు. ఆందోళనలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
ఆటోలతో ర్యాలీగా ఖైరతాబాద్ చౌరస్తాకు
బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ లో పాల్గొనేందుకు శనివారం ఉదయం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇతర నాయకులు ఆటోలతో ర్యాలీగా బయల్దేరారు. ఖైరతాబాద్ చౌరస్తాలో గంటపాటు మానవహారం నిర్మించి బీసీల రిజర్వేషన్ల పెంపునకు మద్దతు ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల పెంపు సాధించే వరకు ఉద్యమాన్ని వీడేది లేదని కవిత తేల్చిచెప్పారు.
బీసీలకు బాసటగా కవిత కుమారుడు ఆదిత్య
బీసీ రిజర్వేషన్ల పెంపు బంద్ కు కవిత తనయుడు ఆదిత్య మద్దతునిచ్చారు. తన తల్లి కవితతో కలిసి ఖైరతాబాద్ చౌరస్తాలో బీసీల మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అవసరం ఉందని.. ఈ మార్పును మన దగ్గరి నుంచే మొదలు పెట్టాలని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే ఎక్కువ మంది యువతకు అవకాశాలు వస్తాయన్నారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనన్నారు. యువతే ఫ్యూచర్ అని.. బీసీల కోసం తన తల్లి చేస్తున్న ఉద్యమాలకు ప్రతి ఒక్కరు మద్దతునివ్వాలన్నారు.






















