Bandi Sanjay: ఐదు నెలలు ఆగితే తెలంగాణలో అధికారంలోకి బీజేపీ - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఇళ్ల కోసం ఎంతో మంది దరఖాస్తులు చేసుకున్నారని, ఎంత మందికి కేటాయించారో చెప్పాలని బండి సంజయ్ అన్నారు.
Bandi Sanjay Comments in Double Bed Room Houses: తెలంగాణ ప్రజలు ఇంకో ఐదు నెలలు ఓపిక పట్టాలని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నీడ లేని పేద ప్రజలు అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తుందని అన్నారు. ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల (Double Bed Room Houses) కేటాయింపులో కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నేడు (మే 11) కూకట్ పల్లి మూసాపేటలో బీజేపీ నేతలు నిర్వహించిన ‘‘ఆత్మగౌరవ దీక్ష’’లో బండి సంజయ్ (Bandi Sanjay) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆత్మగౌరవ దీక్ష చేస్తున్న బీజేపీ నేతలకు ఆయన అభినందనలు తెలిపారు.
Bandi Sanjay News: తెలంగాణలో ఇళ్ల కోసం ఎంతో మంది దరఖాస్తులు చేసుకున్నారని, ఎంత మందికి కేటాయించారో చెప్పాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7 వేల మందికి కేటాయించి మోసం చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని బండి సంజయ్ చెప్పారు. పేదలకు ఇళ్లు దక్కకుండా వారి నోట్లో తెలంగాణ ప్రభుత్వం మట్టి కొడుతుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుమారుడి మాటలన్నీ కొంపలు ముంచేవే అని.. అమెరికా పోయి చదివిన చదువు మోసం చేయడానికే తప్ప మరెందుకు పనికి రాదని అన్నారు.
కేసీఆర్ మాటలు కోటలు దాటతాయని, డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పెద్ద పెద్ద గ్రాఫిక్స్ తో వీడియోలు చేసి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి చూపించారని అన్నారు. పేదలకు మాత్రం ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారని, ఎంత మందికి ఇళ్లు కేటాయించారు? ఎంతమంది ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నారో దమ్ముంటే కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అక్కడక్కడా కడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం నాసిరకంగా ఉందని ఆరోపించారు. ఇళ్లలోకి వెళ్లకముందే కూలిపోయే దశలో ఉన్నాయని బండి సంజయ్ విమర్శించారు.
రూ.వేల కోట్లు దోచుకున్న కేసీఆర్‌కు పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడానికి చేతులు రావడం లేదని విమర్శించారు. అందుకే పేదల పక్షాన బీజేపీ ఉద్యమిస్తోందని, అదేంటని ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై కేసులు పెట్టి దౌర్జన్యంతో అరెస్టు చేస్తున్నారని అన్నారు. పేదల బాధలను తీర్చేందుకే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్లను నిర్మించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇళ్లు కావాలని అడిగితే లక్షన్నర కావాలని కేసీఆర్ చెబితే.. మరో లక్ష అదనంగా మంజూరు చేశారని చెప్పారు. కానీ కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్లు (Double Bed Room Houses) కట్టిస్తానని ఊరించి మోసం చేశారని అన్నారు.