Asaduddin Owaisi: లోక్‌సభలో అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారంపై దుమారం, ఆ పదం ఎందుకు వాడారో!
AIMIM President Asaduddin Owaisi: లోక్‌సభలో ఎంపీలు ఒక్కొక్కరుగా ప్రమాణం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన వెంటనే జై పాలస్తీనా అని అన్నారు.
Asaduddin Owaisi chanted Jai Palestine | న్యూఢిల్లీ: పార్లమెంట్ లో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జూన్ 24న సోమవారం నాడు కొందరు ఎంపీలు లోక్‌సభలో ప్రమాణం చేశారు. నేడు సైతం ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం దుమారం రేపింది. అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద పదాలు వాడారు. ప్రమాణం పూర్తి చేస్తూ చివర్లో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని అసదుద్దీన్ నినాదాలు చేశారు. అసదుద్దీన్ జై పాలస్తీనా అనడంపై అధికార పక్ష నేతలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ పై యుద్ధంలో హమాస్ తో ఆశ్రయం ఇచ్చిన పాలస్తీనాకు భారత ఎంపీ ఎలా మద్దతు ఇస్తారని బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన స్పీకర్ ఆ పదాలను రికార్డ్స్ నుంచి తొలగిస్తామని చెప్పారు. ఎవరైనా వివాదాస్పద నినాదాలు చేస్తే వాటిని రికార్డ్స్ నుంచి తొలగిస్తారు. అసదుద్దీన్ వాడిన వివాదాస్పద పదాల్ని లోక్ సభ రికార్డ్స్ లో నుంచి తొలగించే అవకాశం ఉంది.
తెలుగు ఎంపీల ప్రమాణ స్వీకారం
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. చివర్లో జై హింద్ అన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణ ప్రమాణం చేశారు. ఆమె తొలిసారి లోక్‌సభ ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అసదుద్దీన్ కంటే ముందు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రమాణం చేశారు. ఈటల సైతం తొలిసారి ఎంపీగా నెగ్గి పార్లమెంట్ లో కాలుపెట్టారు. ఈటల ప్రమాణం చేసి వెళ్తుండగా.. అసదుద్దీన్ ప్రమాణం చేయడానికి స్టేజీ మీదకు వెళ్తుంటే.. బీజేపీ మిత్ర పక్షాలు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులు బీజేపీ సభ్యుల్ని వారించారు. ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. ప్రమాణం చేస్తూ చివర్లో జై హింద్, జై తెలంగాణ, జై సంవిధాన్ అని అన్నారు. బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. గత ఎన్నికల్లోనూ నిజామాబాద్ ఎంపీగా నెగ్గిన ధర్మపురి అర్వింద్ వరుసగా రెండోసారి విజయం సాధించారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలుగులో ప్రమాణం చేశారు. చివరలో కావ్య జై భీమ్, జై భద్రకాళి, సేవ్ కానిస్టిట్యూషన్ అని కడియం కావ్య నానాదాలు చేశారు.