Hema: రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
Rave Party Busted in Bengaluru: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో తన పేరును పలువురు ప్రస్తావించడాన్ని నటి హేమ తీవ్రంగా ఖండించారు.
Actress Hema Clarity in Reve Party: బెంగళూరులో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీలో తెలుగు సినీ నటి హేమ పాల్గొన్నారంటూ కన్నడ మీడియా సహా తెలుగులోనూ వస్తున్న ప్రచారంపై ఆమె స్వయంగా ఖండించారు. ఆ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ కొట్టిపారేశారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని.. బెంగళూరు రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో కూడా తనపై జరుగుతున్న ప్రచారాన్ని నటి హేమ ఖండించారు. ఈ మేరకు హేమ ఓ వీడియోను విడుదల చేశారు.
‘‘నేను ఏ నగరానికి వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. ఇక్కడ నా ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. నాపై మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి. అదంతా ఫేక్ న్యూస్. అక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నా మీద వస్తున్న వార్తలను నమ్మకండి’ అని హేమ కోరారు.
బెంగళూరులో రేవ్ పార్టీ
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఓ ఫాం హౌస్‌లో ఆదివారం (మే 19) రాత్రి రేవ్ పార్టీ జరిగింది. స్థానిక జీఆర్ ఫామ్ హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో వాసు అనే వ్యక్తి పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించినట్లుగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు చెబుతున్నారు. ఈ రేవ్ పార్టీలో లిక్కర్ తో పాటుగా పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా లభ్యం అయ్యాయి. జీఆర్ ఫామ్‌హౌస్ అనేది హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యక్తికి చెందినది తేల్చారు.
ఈ పార్టీలో తెలుగు రాష్టాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. టీవీ నటులు సహా, మోడల్స్, పలువురు వ్యాపార, రాజకీయ వారసులు కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు.
అయితే, ఈ రేవ్ పార్టీలో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ పేరుతో పాస్ ఉన్న కారు కూడా గుర్తించినట్లు తెలిసింది. సీసీబీ సోదాల్లో ఎండీఎంఏ సహా పలు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జాగ్వార్ లాంటి ఖరీదైన కార్లతో పాటు మొత్తం ఐదుగురిని సీసీబీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.