Nampalli Court: నాంపల్లి కోర్టు పైనుంచి దూకిన నిందితుడు - వెంటనే ఆస్పత్రికి తరలింపు
మెహదీపట్నం ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన సలీముద్దీన్ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు.
నాంపల్లి కోర్టు భవనం పైనుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. మహ్మద్ సలీముద్దీన్ అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మెహదీపట్నం ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన సలీముద్దీన్ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ రోజు (సెప్టెంబరు 20) కోర్టులో పేషీ ఉండటంతో నాంపల్లి కోర్టులో సలీముద్దీన్ హాజరయ్యాడు. ఈ క్రమంలోనే కోర్టు భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. దూకిన అనంతరం తీవ్ర గాయాలైన సలీముద్దీన్ ను పోలీసులు ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
అల్వాల్‌లో అనుమానాస్పద వ్యక్తి అరెస్టు
మరోవైపు, అనుమానాస్పందంగా తిరుగుతున్న వ్యక్తిని హైదరాబాద్ అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతను కర్ణాటక కు చెందిన పాత నేరస్తుడు గులాబ్ గంగారాం చౌహాన్ గా(34) గా గుర్తించారు. ఇతను కర్ణాటక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 9 చోట్ల దొంగతనాలకు పాల్పడి జైలు జీవితం గడిపి బయటికి వచ్చిన పాత నేరస్తుడు గంగారాం అని పోలీసుల విచారణలో తేలింది. ఇతను ఈ మధ్యనే నగరానికి చేరుకొని బొల్లారం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతను జైలుకు వెళ్లొచ్చినా తన ప్రవృత్తి మార్చుకోలేదని పోలీసులు తెలిపారు.
తాళాలు వేసిన ఇళ్లను పగటిపూట రెక్కీ నిర్వహించి అల్వాల్, బొల్లారం ప్రాంతాల్లో 6 ఇళ్లను, బొల్లారంలో 2 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతని దగ్గరనుండి 27 తులాల బంగారు, 34 తులాల వెండి ఆభరణాలు రూ.1.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.17,85,000 విలువ ఉంటుందని అంచనా. కేసు నమోదు చేసుకొని నిందితుడిని రిమాండుకు పంపినట్లు మేడ్చల్ డీసీపీ శబరీశ్ వెల్లడించారు. ఈ కేసులో పాత నేరస్థుడిని పట్టుకున్న అల్వాల్ పోలీస్ అధికారులను అభినందిస్తూ వారికి రివార్డులను అందచేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.