" మేం ఎక్కడ నుంచి వచ్చామో చూడలేదు. ఎలాంటి కంటెంట్ ఇస్తున్నామో చూశారు. అందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు. ఏబీపీ విలువలతో ఏబీపీ దేశం మీకు సేవలందించటంలో ముందే ఉంటుంది. మిమ్నల్ని ఓ అడుగు ముందే ఉంచుతుంది.
" -అవినాష్ పాండే, ఏబీపీ నెట్ వర్క్ సీఈవో
హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో జరిగిన ఏబీపీ వందేళ్ల పండుగ, ఏబీపీ దేశం మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ఏబీపీ దేశం ఏడాదిలో సాధించిన ఘనతలను వివరించారు. ఏబీపీ గ్రూప్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్, ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ ఇతర రాజకీయ, సినీ, పాత్రికేయ రంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనేక మైలురాళ్లు
మొదట ఏబీపీ గ్రూప్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్, హీరోయిన్ శ్రుతిహాస్, ఏబీపీ నెట్ వర్క్ సీఈవో అవినాష్ పాండే లు జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఆ తర్వాత ఏబీపీ శతవార్షికోత్సవాన్ని, ఏడాది కాలంలో ఏబీపీ దేశం అధిగమించిన మైలురాళ్లను ఏబీపీ సీఈవో అవినాష్ పాండే వివరించారు.
" "వందేళ్ల ఏబీపీ చరిత్రను ఉత్సవంలా జరపటమే కాదు ఏడాది కిందటే పుట్టిన పసిపాప లాంటి మా ఏబీపీ దేశం చేస్తున్న అద్భుతాలను కూడా పరిచయం చేస్తాం. ఏబీపీ ఎంతంటి దృఢమైన సంస్థనో ఇది స్పష్టం చేస్తుంది. ఏబీపీ దేశం తరపున రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాం. డిజిటల్ న్యూస్ మార్కెట్ లోకి మేం ఎక్కడి నుంచి వచ్చామో చూడలేదు తెలుగు వాళ్లు...మేం వాళ్ల కోసం ఏం చేస్తున్నామో చూశారు. ఏడాది కంటే తక్కువ సమయంలోనే తెలుగులో చాలా పెద్ద మీడియా సంస్థలను దాటుకుని ఏబీపీ దేశం ముందుకు వెళ్లింది. 5 కోట్లకు పైగా కంటెంట్ ఇంప్రెషన్స్ సాధించిన సంస్థగా నిలిచాం. చాలా దేశాల జనాభా కంటే ఇది ఎక్కువ. కామ్ స్కోర్ ప్రకారం తెలుగులో అతిపెద్ద వెబ్ సైట్లలో ఆరో స్థానంలో నిలిచింది ఏబీపీ దేశం. 25-34 వయస్సున్న మహిళలు ఎక్కువగా చూసే వెబ్ సైట్ ల్లో ఏబీపీ దేశానిది మొదటి స్థానం. కొవిడ్ మహమ్మారి భయాల మధ్యలో ఈ సంస్థను ప్రారంభించాం. చాలా మంది కుటుంబాలకు అలాంటి టైంలో దూరంగా ఉంటూ ఏబీపీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఏబీపీ గ్రూప్ ఫ్యామిలీలో ఓ మెంబర్ గా ఏబీపీ దేశం...సంస్థ ఆశయాలకు, అనుగుణంగా పనిచేస్తోంది. మేం నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తున్నాం. మమ్మల్ని నమ్మిన తెలుగు ప్రజలకు తోడుగా వార్తలు అందిచేందుకు కట్టుబడి ఉన్నాం".
" -- అవినాష్ పాండే, సీఈవో, ఏబీపీ నెట్ వర్క్
ఆకట్టుకున్న ఏవీ
ఆ తర్వాత ఏబీపీ దేశం ఏడాదిలో సాధించిన ఘనతలను వివరించేలా వీడియోను ప్రదర్శించారు. ఆనంద్ బజార్ పత్రిక వందేళ్ల ప్రస్థానంలో పాఠకుల్లో కలిగిస్తున్న జిజ్ఞాసకు గుర్తుగా ప్రదర్శించిన 'క్యూరియాసిటీ' షార్ట్ ఫిలిం అందరినీ ఆకట్టుకున్నాయి.
ప్రముఖ నటి శ్రుతిహాసన్ ఏబీపీ కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన సినీ కెరీర్ తో పాటు ప్రస్తుత ఇండియన్ సినిమా దూసుకెళ్తున్న తీరు, ఇతర నటీనటులపై తన అభిప్రాయాలను వెల్లడించారు శ్రుతిహాసన్.
ప్రముఖుల శుభాకాంక్షలు
ఏబీపీ గ్రూప్ శతవార్షికోత్సవంతో పాటు, ఏబీపీ దేశం తొలి ఏడాది ప్రయాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వీడియోల ద్వారా శుభాకాంక్షలు తెలియచేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
" " "స్వతంత్ర సంగ్రామ సమయం నుంచి దేశపత్రికా రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆనంద్ బజార్ పత్రిక వందేళ్లు పూర్తి చేసుకోవటం అభినందనీయం. గ్రూప్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏపీ ప్రభుత్వం తరపున అభినందనలు. డిజిటల్ మీడియా రంగంలో ఏబీపీ దేశం మరింత ఉన్నతస్థానాలకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను".
" -- బొత్స సత్యనారాయణ, ఏపీ విద్యాశాఖమంత్రి
" "ఆనంద్ బజార్ పత్రిక గ్రూప్ వందేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసిందని తెలిసి చాలా సంతోషంగా ఉంది. ఏబీపీ గ్రూప్ యాజమాన్యానికి, సిబ్బందికి నా శుభాకాంక్షలు. తెలుగు డిజిటల్ మీడియా రంగంలో అడుగుపెట్టి ఏడాది పూర్తి చేసుకున్న ఏబీపీ దేశానికి నా శుభాకాంక్షలు. ఏబీపీ దేశం సిబ్బందికి అభినందనలు. ఏబీపీ లాంటి ఘనమైన చరిత్ర ఉన్న గ్రూప్ నుంచి తెలుగునేలపై కి ఏబీపీ దేశం రావటం ఆహ్వానించదగిన విషయం. భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియా దే అనుకుంటున్న తరుణంలో...పాఠకులకు తగిన విధంగా ఎప్పటికప్పుడు వార్తలను చేరవేస్తున్న వైనం నిజంగా అభినందనీయం".
" -- సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు
సుమధుర ఆర్ట్ అకాడమీ తరపున శ్రావ్య మానస బృందం నిర్వహించిన కూచిపూడి నృత్య కళారూపకం అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగు రాష్ట్రాల సంస్కృతి ఉట్టి పడే విధంగా తమ నృత్యం ద్వారా కళాకారులు చేసిన ప్రదర్శన ప్రశంసలు పొందింది.