YS Sharmila On BRS : ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడిస్తారా?, పాదయాత్ర రద్దు బీఆర్ఎస్ కుట్ర- వైఎస్ షర్మిల
YS Sharmila On BRS : తన పాదయాత్రను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కుట్రచేస్తుందని వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల కబ్జాలపై ప్రశ్నిస్తే నీచంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
YS Sharmila On BRS : మహబూబాబాద్ లో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర అనుమతిని పోలీసులు రద్దు చేశారు. షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తనను తీవ్ర పదజాలంతో దూషించారన్నారు. ఒక మహిళను ఇష్టం వచ్చినట్లు ఎలాంటి మాటలైనా అంటారా? అని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మండిపడ్డారు. వేల ఎకరాల భూకబ్జాలు చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై ఓ మహిళ ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌లో 2014లో ప్రభుత్వానికి చెందిన భూములు 2170 ఎకరాలుంటే వీటిల్లో 2100 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ నియోజకవర్గంలో అసలు ప్రభుత్వ భూములే లేవని నివేధిస్తు్న్నారన్నారు. గిరిజన భూములు, చెరువులు కబ్జా చేశారని స్థానికులే ఆరోపిస్తున్నారని షర్మిల అన్నారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులకు ఆధారాలు జతపరిచి ఆరోపించామన్నారు. మహబూబాబాద్ జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారన్నారు. శంకర్ నాయక్ అవినీతిపరుడు కాబట్టే ఆయన గురించి మాట్లాడామని వైఎస్ షర్మిల అన్నారు.
ఒక మహిళను నోటికొచ్చినట్లు మాట్లాడతారా?
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజ్యం దొంగల రాజ్యం అని, వలసదారులు వచ్చి పార్టీలు పెడుతున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన ఆరోపణలపై తాను స్పందించానన్నారు షర్మిల. ఎమ్మెల్యే నన్ను పరుషపదజాలంతో విమర్శించారు. ఒక మహిళను ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా? అలా ఎందుకు మాట్లాడరని ప్రశ్నిస్తే అది తప్పా అని నిలదీశారు. ఒక మహిళను ఉద్దేశించి నోటికేది వస్తే అది అంటారా అని మండిపడ్డారు. తన ఎస్కార్ట్ వాహనం, అంబులెన్స్ పై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారన్నారు. మంత్రి ఎర్రబెల్లి ఆడవాళ్లు అయ్యి ఉండి మాట్లాడుతున్నారంటున్నారని, ఆడవాళ్లయితే మాట్లాడకూడదా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
బీఆర్ఎస్ కుట్ర
ఒక మహిళపై పాలకులు ఇంత నీచంగా మాట్లాడిస్తారా అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతలు తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అణిచివేత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అక్రమాలను ప్రశ్నిస్తే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, దాడులకు తెగబడుతున్నారన్నారు. కబ్జాలపై ప్రశ్నినందుకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనపై దాడి చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కుట్రతోనే వైఎస్ఆర్టీపీ పాదయాత్రను అడ్డుకుందని తీవ్ర విమర్శలు చేశారు.
పాదయాత్రకు అనుమతి రద్దు
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. షర్మిల పాదయాత్రకు కూడా అనుమతిని రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మహబూబాబాద్ సమీపంలో బేతోలులో దగ్గర షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఆమె ఉండే కారవాన్ లోకి వెళ్లి షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను పోలీస్ వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. షర్మిలను హైదరాబాద్ తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న (ఫిబ్రవరి 18) మహబూబాబాద్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌ను పరుష పదజాలంతో షర్మిల దూషించారని బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.