YS Sharmila : 4 గంటలుగా రోడ్డుపైనే వైఎస్ షర్మిల దీక్ష, విజయమ్మను అడ్డుకున్న పోలీసులు!
YS Sharmila : హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద నాలుగు గంటలుగా రోడ్డుపై బైఠాయించి వైఎస్ షర్మిల ఆందోళన చేస్తున్నారు.
YS Sharmila : ప్రజాప్రస్థాన పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోటస్ పాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తున్నారు. నాలుగు గంటలుగా రోడ్డుపైనే కూర్చొని షర్మిల దీక్ష చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద షర్మిల నిరసన తెలిపారు. పోలీసులు ఆమెను అరెస్టు చేసి లోటస్ పాండ్ కు తరలించారు. లోటస్ పాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి షర్మిల ఆందోళన చేస్తున్నారు. రోడ్డుపైనే దీక్ష చేస్తున్న షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన విజయమ్మను ఇంటివద్దే పోలీసులు అడ్డుకున్నారు. విజయమ్మ వాహనానికి అడ్డంగా పోలీసు వాహనం నిలిపి విజయమ్మను అడ్డుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని వైఎస్ విజయమ్మ విమర్శించారు. రాహుల్ గాంధీ, బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. షర్మిలకు భయపడి అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని షర్మిల అన్నారు. తన తల్లిని కూడా అడ్డుకున్నారని తెలిపారు.
నన్ను చంపేందుకు ప్రభుత్వం కుట్ర- షర్మిల
ప్రజాప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినతిపత్రం అందించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్ కు తరలించారు. లోటస్ పాండ్ వైఎస్ఆర్టీపీ కార్యాలయం వద్ద వైఎస్ షర్మిల దీక్ష కొనసాగిస్తున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని, బేడీలు వేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది పోయి ఇలా అణగదొక్కడం భావ్యమేనా? అని ప్రశ్నించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రజా సమస్యలను ఎత్తి చూపడానికి చేస్తున్న యజ్ఞం అన్నారు. మేం అడుగడుగునా శాంతియుతంగా పాదయాత్ర చేశామన్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించలేదన్నారు. 3500 కి.మీ. దాటిన తర్వాత టీఆర్ఎస్ గూండాలే తమపై దాడి చేశారని ఆరోపించారు. వైఎస్ఆర్టీపీ వల్ల కేసీఆర్ పాలనకు ప్రమాదం అని తెలిసి పాదయాత్రను ఆపడానికి కుట్ర పన్నారని విమర్శించారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి, మమ్మల్ని అరెస్ట్ చేశారని, పాదయాత్రను అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని షర్మిల అన్నారు. తన తల్లిని కూడా అడ్డుకున్నారని తెలిపారు.
అవహేళన చేసినా భరించాం
వ్యక్తిగతంగా ఎక్కడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదని వైఎస్ షర్మిల అన్నారు. ఎవరిని కించపరచలేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రశ్నించామన్నారు. చాలారోజులు పాదయాత్ర సజావుగా సాగిందని, తమ పార్టీ నాయకులపై దాడులు చేసిన సంయమనం పాటించారన్నారు. కేసీఆర్ పని గట్టుకుని తమ పాదయాత్రపై కుట్ర చేశారని ఆరోపించారు. పోలీసులను జీతగాళ్లలా, టీఆర్ఎస్ కార్యకర్తలుగా వాడుకొని తమను అరెస్ట్ చేయించారన్నారు. బెయిల్ పై బయటకు రాకుండా రిమాండ్ లో పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇప్పుడు పాదయాత్రకు అనుమతి రాకుండా చేశారని ఆక్షేపించారు. ఎనిమిదేండ్లుగా కేసీఆర్ ను ప్రశ్నించకపోవడం వల్లే ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందన్నారు. వైఎస్సార్టీపీ స్థాపించాక ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం పోరాడుతున్నామన్నారు. మమ్మల్ని శిఖండి అని తిట్టినా, మరదలు అని హేళన చేసినా, వ్రతాలు అని కించపరిచినా, తొక్కుతాం అని హెచ్చరించినా మౌనంతో ఉన్నామన్నారు. టీఆర్ఎస్ నేతలే వ్యక్తిగత దూషణలకు పాల్పడి, మమ్మల్ని అరెస్ట్ చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే.. అవి రెచ్చగొట్టే వ్యాఖ్యాలు అవుతాయా అని ప్రశ్నించారు. ఒక మహిళ వచ్చి ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారనేది వాస్తవమన్నారు.