Revanth Reddy : భద్రాచలం ముంపులో కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర- రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
Revanth Reddy : తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇసుక దోపిడీ కారణంగానే భద్రాచలం మునిగిపోయిందని విమర్శించారు.
Revanth Reddy : ప్రముఖ యాంకర్, రేడియో జాకీ కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ ల సమక్షంలో కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే అన్నారు. అయితే 8 సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబం అభ్యున్నతి కోసం వారి ఆస్తులు పెంచుకొవడం కోసమే రాష్ట్రాన్ని ఉపయోగించుకున్నారని విమర్శించారు. కత్తి కార్తీక తన వంతు కృషి చేయాలని కోరారు. వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు.
వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు.
జాతీయ రాజకీయాలపై చర్చ
10 రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదు అయి గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. వర్షకాలం వస్తున్నప్పుడు మే నెలలోనే ఆయా శాఖలతో , మంత్రులతో సీఎం సమీక్ష చేయాల్సి ఉందన్నారు. ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి నిరంతరం సీఎం పర్యవేక్షించాలని, వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్య శాఖ , డిజాస్టర్ సమయంలో విపత్తు బృందాలను అప్రమత్తం చేయాలన్నారు. కానీ సీఎం కేసీఆర్ సమీక్ష చేసినప్పుడు వైద్య ఆరోగ్య శాఖను కానీ డిజాస్టర్ బృందాలను, ఆయా అధికారులను పిలవకుండా పార్టీ ఫిరాయింపులపై సమీక్ష చేస్తున్నారని ఆరోపించారు. పక్క రాష్ట్ర నేతలకు ఫోన్ చేసి జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్రపై మాట్లాడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలి!
సింగరేణి ఉద్యోగులు ఇతరులను కాపాడబోయి ఇద్దరు మరణించారు. కనీసం వారికి సంతాపం కూడా ప్రభుత్వం తెలియజేయలేదు. వరదలు వచ్చే 20 నియోజకవర్గాల్లో మంత్రులను, ఆయా శాఖ అధికారులను అలెర్ట్ చేయాలని సూచించాం. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించాం. రీడిజైన్ పేరుతో లక్ష కోట్లకు పైగా ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఎక్కడికక్కడ మోటార్లు మునిగిపోయాయి. అవి మళ్లీ పనిచేస్తాయని నమ్మకం లేదు. ఆ మోటార్లలో కోట్ల అవినీతి జరిగింది. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలైపోయింది. వరదలు వచ్చినప్పుడు మోటార్లు మునుగుతాయని అంటున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం మునిగాయా... నిపుణుల పేరుతో అవినీతికి తెరలేపారు. ప్రజలు కొట్టుకుపోయి చచ్చిపోతుంటే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో కలుషితమైన తిండి వల్ల 800 మంది రోగాల బారిన పడ్డారు. వారిని ఇంత వరకు ప్రభుత్వ పరంగా పరమర్శించలేదు. 11 లక్షల ఎకరాల్లో పంట మునిగిపోయింది. - రేవంత్ రెడ్డి
జాతీయ విపత్తుగా ప్రకటించాలి
సర్వేలు అన్ని టీఆర్ఎస్ కు సగం స్థానాలే అని చెబుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తండ్రీ కొడుకులు నాశనం చేశారన్నారు. నేషనల్ డిజాస్టర్ బృందాలను పంపించాలని ప్రధానికి కాంగ్రెస్ లేఖ రాసిందన్నారు. నష్టపోయిన రైతులకు పంట పరిహారం చెల్లించాలని కోరారు. ఇసుక దోపిడీ వల్లే భద్రాచలం మునిగిపోయిందని విమర్శించారు. వరదలకు కారణం కేసీఆర్ కుటుంబం ఇసుక దోపిడీ అని మండిపడ్డారు. వరదల్లో ప్రజలు,పశువులు ఆస్తులు కొట్టుకుపోతుంటే జాతీయ రాజకీయాల పై సమీక్ష చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలను జాతీయ విపత్తుగా గుర్తించి తక్షణమే రూ.2 వేల కోట్లు రిలీజ్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించాలన్నారు.
కాంగ్రెస్ లో చేరిన కత్తి కార్తీక
కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా, గర్వంగా ఉందని కత్తి కార్తీక అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మీడియాలో ఉండి, తెలంగాణ యాస, భాషపై చైతన్యం కలిగించామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారన్నారు.