TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
TS Inter Board : హైదరాబాద్ అంబర్ పేట ఘటనపై ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు ఇచ్చింది. కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల సర్టిఫికెట్లు ఎట్టిపరిస్థితుల్లో ఆపవద్దని హెచ్చరించింది.
TS Inter Board : హైదరాబాద్ అంబర్‌పేట పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం సంచలనం అయింది. టీసీ ఇవ్వకుండా కాలేజి యాజమాన్యం వేధిస్తుందన్న కారణంతో నిలదీసేందుకు ప్రిన్సిపల్ గదికి వెళ్లిన ఓ విద్యార్థి నాయకుడు పెట్రోల్ మీద పోసుకున్నాడు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ప్రిన్సిపల్, మరో వ్యక్తికి కూడా మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వీలైనంత త్వరగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇంటర్మీడియెట్ బోర్డు కీలక ఆదేశాలు
అంబర్‌పేటలో ఓ ప్రైవేటు కళాశాల ఘటనపై ఇంటర్ బోర్డు స్పందించింది. కార్యదర్శి జలీల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు ఎట్టిపరిస్థితుల్లో ఆపవద్దని కళాశాలలకు ఆదేశాలు జారీచేశారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీచేయాలని ఆదేశించారు. ఆ బాధ్యత ప్రిన్సిపల్స్ పై ఉందన్నారు. ఏ కారణంగానైనా విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడానికి వీల్లేదని జలీల్ హెచ్చరించారు. కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే డీఐఈవో, ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రైవేటు కాలేజీలను తనిఖీ చేసి, సర్టిఫికెట్లు ఇవ్వని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
అసలేం జరిగింది?
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో విద్యార్థి ఒకరు తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకోవడమే కాకుండా ప్రిన్సిపాల్‌కు కూడా అంటించిన ఘటన చోటు చేసుకుంది. ఆ విద్యార్థి ఇలా ఎందుకు చేశారో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. అంబర్‌పేటలో ఉన్న ప్రముఖ గ్రూప్‌నకు చెందిన కాలేజీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువుతున్నారు. ఆ విద్యార్థులు పలు రకాల విద్యార్థి సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా ఉన్న ప్రశాంత్ గౌడ్ అనే విద్యార్థి ఈ ఉదయం ప్రిన్సిపాల్ రూమ్‌కు వెళ్లారు. ఏ విషయం మాట్లాడటానికి వెళ్లారో స్పష్టత లేదు. కానీ కాసేపటికే తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. ప్రిన్సిపాల్‌కు కూడా అంటించే ప్రయత్నం చేశారు.
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థి
విద్యార్థి ప్రశాంత్ గౌడ్ ఒక్క సారిగా ఇలా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో అందరూ ఒక్క సారిగా ఆందోళకు గురయ్యారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లను పిలిపించారు. విద్యార్థితో పాటు ప్రిన్సిపాల్‌కు కూడా కాలిన గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి ఇద్దర్నీ తరలించారు. ఇద్దరిలో విద్యార్థి ప్రశాంత్ గౌడ్ పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కాలిన గాయాలు కావడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
Also Read : Telangana Power : తెలంగాణలో కరెంట్ కోతలు తప్పవా ? ప్రభుత్వం ఏం చేయబోతోంది ?