Money Siezed: రూ.2.09 కోట్లు, 27 కేజీల బంగారం సీజ్ - ఎన్నికల వేళ హైదరాబాద్ పోలీసుల విస్తృత తనిఖీలు
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీల్లో విస్తృతంగా నగదు పట్టుబడుతోంది. కవాడీగూడలో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకోగా మియాపూర్ లో 27 కేజీల బంగారం సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉండడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేకుండా నగదు, బంగారం తరలిస్తే సీజ్ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్ గాంధీనగర్ పరిధిలోని కవాడీగూడలో నిర్వహించిన తనిఖీల్లో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తరలిస్తోన్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు వనస్థలిపురంలో ఎల్బీ నగర్ SOT పోలీసులు కారులో తరలిస్తోన్న రూ.29.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపకపోవడంతో నగదు సీజ్ చేసినట్లు తెలిపారు.
మియాపూర్ లో 27 కేజీల బంగారం
మరోవైపు, మియాపూర్ వద్ద కూడా భారీగా బంగారం, వెండి పట్టుబడింది. 27 కిలోల బంగారం, 15 కిలోల వెండిన స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సరైన పత్రాలు లేకుండా వీటిని తరలిస్తోన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా మరో వాహనంలో రూ.14 లక్షల నగదును సైతం సీజ్ చేసినట్లు చెప్పారు.
మాదాపూర్ లోనూ
సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్ లోనూ పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అయ్యప్ప సొసైటీలో వాహనాలు తనిఖీ చేస్తుండగా, రూ.32 లక్షల నగదు పట్టుబడింది. అలాగే, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రూ.10 లక్షల డబ్బును సీజ్ చేశారు.
148 చెక్ పోస్టులు ఏర్పాటు
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా బంగారం, వెండి, డబ్బు తరలిస్తే కఠిన చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర శాఖల సమన్వయంతో భారీగా అక్రమ నగదు పట్టుబడుతోంది. పోలీస్, రవాణా శాఖ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ వంటి శాఖల సోదాల ద్వారా డబ్బు, బంగారం, మద్యం, ఇతర సామాగ్రి పట్టుబడుతున్నాయి.
ఇప్పటివరకూ
- నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్ల దగ్గర ఇటీవల పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి చెన్నైకు కారులో తరలిస్తోన్న రూ.3 కోట్లను సీజ్ చేశారు. ఇది హవాలా సొమ్ముగా గుర్తించారు. అలాగే కొండమల్లేపల్లి పీఎస్ వద్ద చెక్ పాయింట్ లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తోన్న రూ.1.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
- హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో రూ.5 కోట్లకు పైగా నగదు పట్టుబడినట్లు సమాచారం.
ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బు, బంగారాన్ని సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్లకూడాదని స్పష్టం చేశారు. రూ.50 వేలకు మించి నగదు ఉంటే కచ్చితంగా సంబంధిత పత్రాలు ఉండాల్సిందేనని పేర్కొన్నారు.