DAV School Incident: హెచ్ఎం చనువుతో టీచర్‌గా మారిన డ్రైవర్!, ఇప్పుడు ఇద్దరూ కలిసి ఊచలు లెక్కిస్తున్నారు
DAV School Incident: పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరిగిందన్న సామేత ఈ విషయంలో కరెక్టుగా సరిపోతుంది. డ్రైవర్‌ని తీసుకొచ్చి హెచ్ఎం నెత్తిమీద పెట్టుకుంటే టీచర్ గా మారి నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు.
DAV School Incident: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయురాలు.. డ్రైవర్ కు ఇచ్చిన చనువుతో ఓ నాలుగేళ్ల పాప జీవితం నాశనం అయింది. డ్రైవర్ గా పనిచేస్తూ గేటు బయట ఉండాల్సిన వాడు.. హెచ్ఎం చనువుతో బడిలోకి వచ్చాడు. ఎవరూ లేని గదిలోకి అమ్మాయిని తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తనకు నచ్చినప్పుడు ఎల్కేజీ విద్యార్థులకు హాజరు తీసుకోవడమే కాకుండా క్లాసులు కూడా చెప్పేవాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఇతడు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ రోడ్ నెం.14 డీఏవీ పబ్లిక్ స్కూల్ లో అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రజనీకుమార్, హెచ్ఎం మాధవిల కస్టడీ మంగళవారంతో ముగిసింది.
బుధవారం రోజు తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు. కస్టడీ విచారణలో పోలీసులు పలు విషయాలను రాబట్టారు. నిందితుడు రజనీ కుమార్ పాఠశాలలో అన్నీ తానై వ్యవహరించడమే కాకుండా ఏకంగా క్లాస్ తీసుకునేవాడని విచారణలో తేలింది. ప్రతిరోజూ ఓ క్లాస్ తీసుకోవడమే కాకుండా చిన్నారుల హాజరును కూడా నమోదు చేసేవాడని గుర్తించారు. పాఠశాలలోని సీసీ కెమెరాల ఆధారంగా ఆయన పర్యవేక్షణలో ఉండటంతో అతడు చేసిన అక్రమాలన్నీ వెలుగులోకి రాకుండా కొన్ని సీసీ కెమెరాల వైర్లను కట్ చేసిన విషయాన్ని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కొందరు టీచర్లు నిందితుడిపై ఫిర్యాదు చేసినా హెచ్ఎం మాధవి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం కూడా విచారణలో వెలుగు చూసింది. పాఠశాలలో ఏదైనా కార్యక్రమం జరిగితే తల్లిదండ్రులు డబ్బులను నేరుగా నిందితుడి అకౌంట్ లో పంపించేవారని పోలీసులు గుర్తించారు. డ్రైవర్ గా ఉండాల్సిన నిందితుడు టీచల్ అవతారం ఎత్తడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. స్కూల్ లో ఇష్టారాజ్యం నెలకొనడం, క్రమ శిక్షణ లేకపోవడం ఇవన్నీ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ మాధవి నిర్వాకంతోనే జరిగినట్లుగా తేలింది.
స్కూల్ రీఓపెన్ - కానీ సర్కారు షరతులు!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డీఏవీ స్కూల్ వ్యవహారంలో ప్రభుత్వం కాస్త మెత్తబడింది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని అనుమతుల రద్దు నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి అనుమతులు పునరుద్దరిస్తూ ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ. బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూలు (DAV School Incident)లో ఎల్‌కేజీ చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగిన ఘటన సంచలనం రేపింది. ఈ దుర్ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... స్కూల్ రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. జరిగిన సంఘటన ఆమోద యోగ్యం కాదని.. కానీ వందల మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని స్కూల్ అనుమతుల రద్దుపై పునారోలోచించాలని విద్యార్థుల పేరెంట్స్, స్కూల్ యాజమాన్యం వేడుకుంది.
స్కూల్ అనుమతి పునరుద్దరణ కోసం స్కూల్ యాజమాన్యం, పేరెంట్స్ పోరాడారు. ప్రభుత్వ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరకు స్కూల్ అనుమతులపై సానుకూల నిర్ణయం తెప్పించుకోగలిగారు. అయితే ఈ అనుమతులు ఈ ఒక్క ఏడాదీకేనంటూ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అక్టోబరు 26 హైదరాబాద్ డీఈవో (జిల్లా విద్యాధికారి)తో స్కూల్ డైరెక్టర్లు భేటీ అయ్యారు. అదే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అక్కడకు చేరుకున్నారు. స్కూల్ గుర్తింపు రద్దును వెనక్కి తీసుకోవాలని పేరెంట్స్ ఇచ్చిన వినతి పత్రాలను డీఈవోకు స్కూలు మేనేజ్‌మెంట్ అందజేసింది.