(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad Alai Balai : హైదరాబాద్ లో ఉత్సాహంగా అలయ్ బలయ్, కళాకారులతో కలిసి డప్పు వాయించిన మెగాస్టార్
Hyderabad Alai Balai : హైదరాబాద్ నాంపల్లిలో అలయ్-బలయ్ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గరికపాటి, చిరంజీవి, బండి సంజయ్ ఇతర పార్టీలు పాల్గొన్నారు.
Hyderabad Alai Balai : హైదరాబాద్ నాంపల్లిలో అలయ్-బలయ్ కార్యక్రమాన్ని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘనంగా నిర్వహించారు. ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని గుర్తుచేస్తూ కళా ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరయ్యారు. అయితే అలయ్-బలయ్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కళాకారులతో కలిసి ఆయన డప్పు వాయించారు. పోతురాజులతో కలిసి చిరు డ్యాన్స్ చేశారు. చిరంజీవికి బండారు దత్తాత్రేయ ఆదరంగా స్వాగతం పలికారు. అలయ్ బలయ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సందడి చేశారు. డప్పు వాయించిన వీహెచ్, పోతరాజులతో కలిసి డ్యాన్స్ చేశారు.
శక్తివంతమైన తెలంగాణ సాధనకు కృషి-బండి సంజయ్
అలయ్ బలయ్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. బండి సంజయ్ ను బండారు దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు. అలయ్ బలయ్ నిర్వాహకులు బండారు విజయలక్ష్మీ దంపతులను బండి సంజయ్ సన్మానించారు. అలయ్ బలయ్, హోలీ అంటే దత్తాత్రేయ గుర్తుకొస్తారని బండి సంజయ్ అన్నారు. కుల, మతాలకు అతీతంగా సంస్కృతి సంప్రదాయాలను పెద్దపీట వేస్తూ అలయ్ బలయ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా అన్నారు. ఆరోగ్యకరమైన, శక్తివంతమైన తెలంగాణ సాధన దిశగా కృషి చేద్దామన్నారు.
అలయ్ బలయ్ విశ్వవ్యాప్తం కావాలి- చిరంజీవి
ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ... మతాలు, కులాలు, వర్గాలకు అతీతంగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం విశ్వవ్యాప్తం కావాలన్నారు. ప్రేమ, సోదరాభావం అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్న ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పెద్ద హిట్ సినిమా వచ్చిన తరువాత అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చాలా సంవత్సరాలుగా అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలనుకుంటున్నానని, ఈ ఏడాది అవకాశం వచ్చిందని చిరు తెలిపారు. దేశంలోనే సంస్కృతి సంప్రదాయాల కోసం చేపట్టిన కార్యక్రమం అలయ్ బలయ్ అని చిరంజీవి అన్నారు. పంచడం, పుచ్చుకోవడం అనేది ఎక్కడా లేదని, ఒక్క తెలంగాణ సంప్రదాయంలోనే ఉందన్నారు. సినీ పరిశ్రమలో అందరూ కలిసున్నప్పటికీ అభిమానులు ద్వేషించుకుంటున్నారని, హీరోల మధ్య సహృద్భావ వాతావరణం కల్పిస్తే అభిమానుల్లో మార్పు వస్తుందన్నారు. ఇండస్ట్రీలో కూడా అందరిని పిలిచి ఇలాంటి సమావేశం ఏర్పాటు చేశానని చిరంజీవి తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో దసరా పండగ రోజున జమ్మి ఆకులు ఇచ్చి పెద్దవాళ్లకి దండం పెట్టడం, తోటి వారిని కౌగిలించుకోవడం సంప్రదాయం అని గుర్తుచేశారు. 17 ఏళ్లుగా దత్తాత్రేయ ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో గర్వకారణమని చిరు తెలిపారు.
Also Read : మునుగోడు ఉపఎన్నిక కేసీఆర్‌కు అసలైన పరీక్ష- మరి ప్రిపరేషన్ ఎలా ఉంది?