Telangana Bonalu Utsav : తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాల నిర్వహణ, ఉత్సవాలకు రూ.15 కోట్లు మంజూరు - మంత్రి తలసాని శ్రీనివాస్
Telangana Bonalu Utsav : తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 30న నుండి బోనాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
Telangana Bonalu Utsav : తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మితో పలువు ఉన్నతాధికారులు, బోనాల కమిటీ సభ్యులు పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. జూన్ 30న గోల్కొండ బోనాలు, జులై 17న సికింద్రాబాద్, 24న హైదరాబాద్ బోనాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ బోనాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు.
రాష్ట్ర పండుగ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని మంత్రి తలసాని గుర్తుచేశారు. గత రెండేళ్లు కరోనా కారణంగా బోనాలను ఘనంగా జరుపుకోలేకపోయినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ సంవత్సరం బోనాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. బోనాల కోసం ప్రభుత్వ దేవాలయాలకే కాకుండా ప్రైవేట్ దేవాలయాలకు సుమారు 3 వేల దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా బోనాల ఉత్సవాలను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు, శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో దేవాలయాల పరిసరాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని మంత్రి తలసాని పేర్కొన్నారు.
26 దేవాలయాల్లో ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పణ
సుమారు 26 దేవాలయాలలో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పారు. అదేవిధంగా అమ్మవారి ఊరేగింపు కోసం అంబారీలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే పూర్తి ఖర్చులను భరిస్తుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో LED స్క్రీన్ లు, త్రీడీ మ్యాపింగ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి సాంస్కృతిక శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. భక్తుల కోసం వాటర్ ప్యాకెట్ లను అందుబాటులో ఉంచడం, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు, అంబులెన్స్ లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.