Minister KTR On PM Modi : కార్పొరేట్ మిత్రుల కోసం ప్రధాని మోదీ అడ్డగోలు నిర్ణయాలు,విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గింపుపై కేటీఆర్ ఫైర్
Minister KTR On PM Modi : ప్రధాని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పెట్రో ధరలను తగ్గించకుండా, కార్పొరేట్ అయిల్ కంపెనీలకు విండ్ ఫాల్ టాక్స్ తగ్గించడంపై ఆయన మండిపడ్డారు.
Minister KTR On PM Modi : ప్రధాని మోదీ ప్రభుత్వం కామన్ మ్యాన్ ప్రభుత్వం కాదని, కార్పొరేట్ల ప్రభుత్వంగా మారిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. అడ్డగోలుగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సెస్ లు, పన్నులతో ప్రజలకు భారంగా మారిందన్నారు. పెట్రో ధరలను తగ్గించకుండా, కార్పొరేట్ ఆయిల్ కంపెనీలపై విండ్ ఫాల్ టాక్సులు తగ్గించిన కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశ ప్రజల ఆర్థిక కష్టాలు కనపడవన్న కేటీఆర్, కేవలం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనం కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ఒకవైపు సెస్ లు, సుంకాల పేరుతో పెట్రో ధరలను భారీగా పెంచిన కేంద్రం, పెట్రో భారం నుంచి ఉపశమనం కావాలని ప్రజలు కోరితే ఏ మాత్రం పట్టించుకోకుండా కార్పొరేట్ ఆయిల్ కంపెనీలకు విండ్ ఫాల్ టాక్సును తగ్గించిందని విమర్శించారు. కార్పొరేట్లకు వరాలిస్తున్న కేంద్రం, సామాన్యులపై భారం మోపడం, చమురు కంపెనీలకు లాభాలు వచ్చేలా చూస్తూ, జనం జేబులకు చిల్లులు పెట్టడమే బీజేపీ ప్రభుత్వ విధానంగా మారిందన్నారు. పెట్రోల్, డీజిల్ పై విధించిన అదనపు పన్నులు, ఎక్సైజ్ సుంకాలు, సెస్సులను తగ్గించాలని దేశ ప్రజలంతా డిమాండ్ చేస్తుంటే కనీసం పట్టించుకోవడంలేదన్నారు.
While we are demanding relief for all Indians by way of removal of Additional Excise Duties & Cess, NPA Govt decides to reduce #WindfallTax on Fuel !!
— KTR (@KTRTRS) December 16, 2022
Priorities of NPA Govt are clear but the Question is; into whose pockets are the Windfall Gains being routed to?#FuelPrices pic.twitter.com/UwRPuYfLFi
కార్పొరేట్ మిత్రులకు లబ్ధి
మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు విండ్ ఫాల్ పన్నులను తగ్గించిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తాజా నిర్ణయంతో తమ ప్రథమ ప్రాధాన్యత కార్పొరేట్ కంపెనీలే కానీ, దేశ ప్రజలు కాదని మోదీ సర్కార్ మరోసారి నిరూపించుకుందన్నారు. అడ్డగోలుగా కార్పొరేట్ కంపెనీలు సంపాదించిన చమురు సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెలుతున్నాయో అందరికీ తెలుసని కేటీఆర్ అన్నారు. దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలకు రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపించి సామాన్య ప్రజలను బీజేపీ ప్రభుత్వం దోచుకుందని కేటీఆర్ విమర్శించారు. పెట్రో రేట్లు తగ్గించడానికి రష్యా నుంచి తక్కువ రేటుకి ముడిచమురు కొంటున్నామని గొప్పలు చెప్పుకున్న కేంద్రం, ఆ ఇంధనాన్ని దేశీయ అవసరాలకు వాడకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు కార్పొరేట్ ఆయిల్ కంపెనీలకు అనుమతి ఎందుకు ఇచ్చిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రష్యా నుంచి తక్కువ ధరకు కొని, దాన్ని ఇతర దేశాలకు భారీగా ఎగుమతి చేసి కార్పోరేట్ ఆయిల్ కంపెనీలు అడ్డగోలుగా సంపాదించిన సొమ్ములపై టాక్స్ తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వ ఆంతర్యాన్ని కేటీఆర్ ప్రశ్నించారు.
రూ.30 లక్షల కోట్లు దోచుకున్నారు
తెలంగాణ లాంటి రాష్ట్రాలు 2014 నుంచి వ్యాట్ ను ఏమాత్రం పెంచకున్నా వ్యాట్ ను తగ్గించడం లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. సెస్ ల పేరుతో రూ.30 లక్షల కోట్లు కొల్లగొట్టి రాష్ట్రాల పన్నుల వాటాకు ఎసరు పెట్టిందన్నారు. తిరిగి రాష్ట్రాల పైన కేంద్ర ప్రభుత్వం నిందలు వేస్తున్నదని మండిపడ్డారు. దేశంలో పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్రాల వ్యాట్ పెంపు కారణం కానే కాదన్నారు. మోదీ ప్రభుత్వం భారీగా పెంచిన సెస్సుల ఫలితంగానే పెట్రో రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయని మండిపడ్డారు. సెస్సుల రూపంలో ఇప్పటివరకు 30 లక్షల కోట్ల రూపాయలను దేశ ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం దోచుకుందన్నారు. వీటిని తగ్గిస్తే పెట్రోలు రూ.70, డీజిల్ రూ.60కే ప్రజలకు అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. తన కార్పొరేట్ మిత్రుల ప్రయోజనాల కోసం ఎన్నో అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ విమర్శించారు.
బీజేపీ క్షుద్రరాజకీయాలు
దేశ ప్రగతి, ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ క్షుద్ర రాజకీయాలతో కాలం గడుపుతుందని కేటీఆర్ విమర్శించారు. దేశ ప్రజలకు అత్యవసరమైన పెట్రో ధరలను తగ్గించే విషయంలో సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇంతేకాదు పన్నులు,సెస్సులను పెంచి దేశ ప్రజలపైన విపరీతమైన పెట్రో భారం మోపిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పటికైనా ఆ నెపాన్ని రాష్ట్రాలపైకి అన్యాయంగా నెట్టడాన్ని ఆపాలని సూచించారు. కార్పొరేట్ కంపెనీల కోసం, బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయడం అలవాటుగా మార్చుకున్న మోదీ సర్కార్ దేశ ప్రజల కష్టాలు, ప్రయోజనాలను పట్టించుకుంటుందన్న నమ్మకం దేశ ప్రజలకు లేదన్నారు.