Minister Harish Rao : మహిళలకు కొత్తగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, వచ్చే నెల నుంచి ప్రారంభం- మంత్రి హరీశ్ రావు
Minister Harish Rao : రాష్ట్రంలో మహిళలకు కొత్తగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. వచ్చే నెల నుంచి ఈ కిట్ల పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు.
Minister Harish Rao : రాష్ట్రంలో ప్రోగ్రాం మేనేజ్మెంట్ యూనిట్(PMU) స్టార్ట్ చేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పాలసీ(AMC) అమలు కోసం ఈ యూనిట్ ను ప్రారంభించామని. ఇవాళ్టి నుంచి ఈ పాలసీ అమలు అవుతోందన్నారు. ఈ విధానంలో ప్రైవేట్ లో మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రిలోని పరికరాలను గంటల్లోనే రిపేర్ చేయడం సాధ్యం అవుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో కోట్ల విలువైన పరికరాలు అందుబాటులో ఉంచామని మంత్రి అన్నారు. AMC పాలసీ అమలు కోసం రూ.17 కోట్లు కేటాయించామన్నారు.
ఈ-ఔషదీ, ఈ-ఉపకరణ్
'రాష్ట్రంలో 5 లక్షలకు పైగా విలువైన పరికరాలు 1,020 ఉన్నాయి. EML, AML లిస్ట్ మందులు అంతకు ముందు 720 రకాలు ఉంటే ఇప్పుడు 843కు పెంచాం. మందుల కొనుగోలుకు సీఎం కేసీఆర్ రూ. 500 కోట్లు కేటాయించారు. ఇందులో 100 కోట్లను సూపరింటెండెంట్ దగ్గర పెడుతున్నాం. మందుల నిర్వహణకు ఈ- ఔషధీ, పరికరాల నిర్వహణకు ఈ- ఉపకరణ్ అందుబాటులోకి తెచ్చాం. covid కేసులు వస్తున్నాయి కాబట్టి అర్హులు అందరూ బూస్టర్ డోస్ వేసుకోండి. టీకాల పంపిణీలో కేంద్రం విఫలం అయింది. బూస్టర్ స్టాక్ పెంచాలని లేఖ రాస్తే కాస్త స్పందించింది.'- మంత్రి హరీశ్ రావు
సి-సెక్షన్ తగ్గింది
రాష్ట్రంలో సి-సెక్షన్ రేటు తగ్గిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. 2021 ఆగస్ట్ లో 62 శాతం ఉంటే ఈ ఏడాది జులైకి సి-సెక్షన్ 56 శాతానికి తగ్గిందన్నారు. కేసీఆర్ కిట్, ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయన్నారు. రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోఈ శాతం 30గా ఉంటే ఇప్పుడు 66.8శాతానికి చేరాయన్నారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో c-section 47.24 శాతం నుంచి 45.92శాతానికి తగ్గించామని, ప్రైవేటులో 80.98శాతం నుంచి 78.86 శాతానికి తగ్గించామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెంచడానికి MCH ఏర్పాటు, సదుపాయాల కల్పనకు సీఎం కేసీఆర్ రూ.400 కోట్లు ఖర్చు చేశారని మంత్రి తెలిపారు.
కేసీఆర్ న్యూట్రీషన్ కిట్
"బిడ్డ కడుపులో పడ్డప్పుడు న్యూట్రీషన్ కిట్, డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ అందిస్తున్నాం. మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి బతుకమ్మ కానుకగా కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ ఇవ్వబోతున్నాం. అత్యధికంగా ఎనీమియా ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ లలో ఈ కిట్ ఇస్తున్నాం. 1.50 లక్షల మంది గర్భిణులకు లబ్ధి చేకూరుతుంది. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం దీని లక్ష్యం. ఒక్కో కిట్ విలువ దాదాపు రూ.2000 ఉంటుంది. రెండు సార్లు ఇస్తాం. కిట్‌లో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్ కిలో- 2 బాటిల్స్, ఒక కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ 3 బాటిల్స్, 500 గ్రాముల నెయ్యి ఉంటాయి. 13.30 లక్షల కేసిఆర్ కిట్స్ లబ్ధిదారులు ఉన్నారు. వారికి రూ.1200 కోట్ల నగదు అందించాం. నిన్న TRR మెడికల్ కాలేజి విద్యార్థులను రీఅలోకేట్ చేయమని కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. మెరిట్ ఆధారంగా మంగళవారంలోగా సర్దుబాటు చేస్తాం.
మిగతా రెండు కాలేజీలకు సర్దుబాటు ఉత్తర్వులు రాగానే వారికి కూడా కౌన్సెలింగ్ నిర్వహిస్తాం." - మంత్రి హరీశ్ రావు
Also Read : Komatireddy Venkatreddy : మునుగోడు ఉపఎన్నిక సెమీ ఫైనల్, అలా చేస్తే రాజీనామా చేస్తా- కోమటిరెడ్డి వెంకటరెడ్డి