Hyderabad News : రెస్టారెంట్ కు వెళ్లిన కుటుంబానికి చేదు అనుభవం, బాలుడిపై ఎలుక దాడి!
Hyderabad News : హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్ కు వెళ్లిన కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ఎలుక దాడిలో బాలుడికి గాయాలయ్యాయి.
Hyderabad News : హైదరాబాద్ లో వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతుంటే తాజాగా ఎలుకలు కూడా రంగంలోకి దిగాయి. ఓ హోటల్ లో ఎలుక బాలుడిపై దాడిచేసింది. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిఫ్రెష్ అవుదామని స్థానిక హోటల్ కు వెళ్లిన కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. మెక్ డొనాల్డ్ బర్గర్ అండ్ ఫ్రైస్ కు వెళ్లిందో కుటుంబం. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలుక బాలుడిపై దాడి చేసింది. హోటల్ తమ పిల్లవాడికి సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు... సదరు ఆహార సంస్థపై చర్యలు తీసుకోవాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాలు ప్రకారం ఆర్మీ మేజర్ గా పని చేస్తున్న సవియో హెర్క్వీస్ గురువారం రాత్రి పేట్ బషీరాబాద్ హైటెన్షన్ లైన్ లో ఉన్న మెక్ డోనాల్డ్ కు కుటుంబంతో కలిసి వెళ్లారు. వాళ్లకు కావాల్సిన ఆర్డర్ ను ఇచ్చి టేబుల్ వద్ద కూర్చున్నారు. ఇంతలో ఓ ఎలుక అకస్మాత్తుగా వచ్చి తొమ్మిదేళ్ల కొడుకుపైకి ఎక్కి కొరికి పారిపోయింది. దీంతో బాలుడికి తొడపై గాయం అయింది. ఈ విషయంపై మెక్ డొనాల్డ్ ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శనివారం బాధితుడు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడికి స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వీధి కుక్క దాడిలో 16 మందికి గాయాలు
హైదరాబాద్ లో వీధి కుక్కల దాడులు కొనసాగుతున్నాయి. బాలానగర్, సాయి నగర్, వినాయక నగర్ లలో కుక్కల స్వైర విహారం చేశాయి. విచక్షణ రహితంగా మనుషులపై దాడి చేశాయి. నగరంలో వరుసగా దాడులు జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు,చిన్నారులు నిత్య అవసరాల కోసం రోడ్ల మీదకు రావాలంటే బయపడే పరిస్థితి నెలకొందంటున్నారు. నగరంలో ఉండాలా లేక వెళ్లిపోవాలా తెలియని అయోమయ స్థితిలో ఉన్నామంటున్నారు. బాలానగర్ పరిధిలో వీధి కుక్కల దాడిలో 16 మంది గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వినాయక్ నగర్, సాయి నగర్ లో ఓ వీధి కుక్క రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారులను, నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో 16 మందికి గాయాలు కాగా అందులో 8 మంది చిన్నారులు ఉన్నారు. వీధి కుక్కల నుంచి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు వేడుకుంటున్నారు. ఇటీవల అంబర్ పేట్ లో కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి చనిపోయాడు. అప్పటి నుంచి వరుసగా కుక్కల దాడులు వెలుగులోకి వస్తున్నాయి.
రైతులపై అడవి పంది దాడి
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లయి వీరంపేటకు చెందిన మంకిడి లక్ష్మీపతి, పెనుక సురేందర్ మొక్కజొన్న చేనులో కంకులు విరుస్తుండగా అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరలించారు గ్రామస్థులు.