Kumaraswamy met KCR : కేసీఆర్ సేవలు దేశానికి ఎంతో అవసరం, బీజేపీతో పాలనా సంక్షోభం- మాజీ సీఎం కుమారస్వామి
Kumaraswamy met KCR : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ సేవలు దేశానికి అవసరం ఉందని కుమారస్వామి అన్నారు. కేసీఆర్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
Kumaraswamy met KCR : దేశానికి కేసీఆర్ సేవలు అవసరం ఉందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్ అనుభవం దేశాభివృద్ధికి ఎంతో అవసరం అన్నారు. హైదరాబాద్ వచ్చిన కుమారస్వామి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ఆదివారం భేటీ అయ్యారు. వీరిద్దరూ మూడు గంటలపాటు చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఎజెండాపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బీజేపీ విధ్వంసకర రాజకీయాలు చేస్తున్న పక్షంలో దేశంలో రాజకీయ, పాలనా సంక్షోభం తప్పదనే విషయాన్ని చర్చించారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సకల వర్గాలను కలుపుకపోతూ భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలన్నారు.
మూస రాజకీయాలతో విసుగు
75 ఏళ్ల స్వతంత్ర దేశంలో సాగుతున్న మూస రాజకీయాలకు ప్రజలు విసుగెత్తిపోయారని, వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తగిన పాలన అవసరం ఉందనే అంశాలపై కేసీఆర్, కుమారస్వామి చర్చించారు. అంతర్జాతీయంగా పలు దేశాలలోని రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సాధించేందుకు ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలను సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు నేడు దేశానికి ఎంతైనా అత్యవసరమని ఏకాభిప్రాయానికి వచ్చారు. జాతీయ సమస్యలపై దిల్లీ కేంద్రంగా జరిపిన చర్చలతోపాటు, పలు రాష్ట్రాల పర్యటనలపై ఇరువురు నేతలు చర్చించారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగానే ఇప్పటికే మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు సాగించి, ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ కుమారస్వామితో అన్నారు.
బీజేపీ ముక్త భారత్
సకల జనులను కలుపుకుని తెలంగాణ కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ కు ఎంతో అనుభవం ఉందని కుమారస్వామి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశానికి ఆయన సేవలు ఎంతో అవసరమని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. కొత్త రాష్ట్రం తెలంగాణను ప్రగతి పథాన నడుపుతున్న కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ప్రధాన భూమిక పోషించాలన్నారు. కేసీఆర్ కు తమ సంపూర్ణ మద్దతుంటుందని కుమారస్వామి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌తో కుమారస్వామి మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. తమ ఇద్దరి మధ్య అర్థవంతమైన చర్చలు జరిగాయని కుమారస్వామి తెలిపారు. తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ సాగించిన ఉద్యమం, శాంతియుత మార్గంలో రాష్ట్రాన్ని సాధించిన తీరుపై ఇరువురు నేతలు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నయంగా ఎదగలేకపోయిందని అభిప్రాయపడ్డారు. బీజేపీ ముక్త భారత్ కోసం కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నారు.
తెలంగాణ మోడల్
తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే ఎంతో అభివృద్ధి చెందిందని కుమారస్వామి అన్నారు. తెలంగాణ గురించి దేశమంతా చర్చించుకుంటుందని తమకూ ఈ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నదని కుమారస్వామి సీఎం కేసీఆర్‌కు అభింనదనలు తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న 24 గంటల ఉచిత విద్యుత్తు, ఉచిత తాగునీరు, సాగునీరు, వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని కుమారస్వామి అన్నారు. తెలంగాణ మోడల్ పాలన తమకు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఇదే విషయమై తమ దృష్టికి వచ్చిన అంశాలను సీఎం కేసీఆర్‌తో చర్చించనని కుమారస్వామి పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంపై కుమారస్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.