Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై రెక్కీ నూరు శాతం వాస్తవం, ఆధారాలతో డీజీపీకి ఫిర్యాదు చేస్తాం- శంకర్ గౌడ్
Pawan Kalyan : పవన్ కల్యాణ్ హత్యకు రెక్కీ జరిగిన మాట నూటికి నూరు శాతం వాస్తవమని జనసేన పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.
Pawan Kalyan : గుట్టు చప్పుడు కాకుండా బాబాయిని గొడ్డలితో చంపేసి గుండెపోటు అని చెప్పడం... కోడి కత్తి డ్రామాలు ఆడి రాజకీయంగా లబ్ధి పొందడం వైసీపీకి మాత్రమే తెలిసిన విద్య... అది ఇతర పార్టీలకు రాదని జనసేన పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆరోపించారు. పవన్ కల్యాణ్ ఇంటి ముందు జరిగిన చిన్న గొడవకు రెక్కీకి ముడిపెట్టి వైసీపీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రెక్కీ జరిగిన మాట నూటికి నూరుశాతం వాస్తవం అని, దానిపై త్వరలోనే తెలంగాణ డీజీపీని కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ “ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు రెక్కీ జరగలేదంటూ.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయనకు మేము ఒకటే చెబుతున్నాం. అసలు రెక్కీ జరగలేదని డిసైడ్ చేయడానికి మీరు ఎవరూ? మీరేమైనా పోలీసు అధికారా? లేక కేసు దర్యాప్తు చేసిన అధికారా? వైజాగ్ ర్యాలీ సందర్భంగా కరెంటు తీసేసి కిరాయి మూకలతో దాడులు చేయించాలని చూడటం నిజం కాదా? పవన్ కల్యాణ్ బయటకు వెళ్తే ఆయన వాహనాలను వెంబడిస్తూ అనుమానస్పదంగా కొన్ని వాహనాలు తిరగడం నిజం కాదా? ఇవన్నీ వదిలేసి పవన్ కల్యాణ్ ఇంటి ముందు తాగి గొడవ చేసిన వారి గురించి పోలీసుల చెప్పిందాన్ని తీసుకొచ్చి రెక్కీకి ముడిపెడుతూ ... వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం సబబు కాదు." అన్నారు.
గొడ్డలితో నరికేసి గుండెపోటు అన్నారు
సొంత బాబాయిని గొడ్డలితో నరికేసి గుండెపోటు అని డ్రామాలు ఆడారని శంకర్ గౌడ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ల అయినా సొంత బాబాయిని చంపిందెవరో తెలుసుకోలేకపోయారని, మీకు తెలిసినా హత్యను కప్పిపుచ్చాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. యావత్ దేశం వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో తెలుసుకోవాలని ఎదురు చూస్తోందని, ముఖ్యమంత్రి సోదరి షర్మిల సీబీఐ ముందు ఇచ్చిన వాగ్మూలం చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది ఎవరు చంపారని అన్నారు. కోడికత్తితో దాడి డ్రామా వేసి ప్రపంచం మొత్తం ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ గూండాలను పరుగులు తీయిస్తున్న ప్రజానాయకుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ప్రజల పక్షన పోరాటం చేయడం తట్టుకోలేక వైసీపీ నాయకులు కక్ష గట్టారని ఆరోపించారు. పవన్, జగన్ లాగా రాజకీయాల్లో అడ్డంగా సంపాదించలేదన్నారు. సినిమాలు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల సొమ్మును లక్షలకు లక్షలు జీతాలుగా తీసుకుంటూ ప్రజల సమస్యలపై స్పందించకుండా తెల్లవారి నిద్రలేచింది మొదలు పవన్ కల్యాణ్ గురించే మాట్లాడటం పరిపాటిగా మారిందని మండిపడ్డారు.
డీజీపీకి ఫిర్యాదు
పవన్ కల్యాణ్ ని తిట్టడానికే మీకు మంత్రి పదవులు ఇచ్చారా? అని శంకర్ గౌడ్ ప్రశ్నించారు. మాట్లాడితే 151 మంది గెలిచాం అంటున్న వైసీపీ నాయకులు, ప్రతి ఒక్కరు రూ. 50 కోట్లు నుంచి రూ. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచారని ఆరోపించారు. జనసేన నేతలు ఒక్కరు కూడా ఓటుకు నోటు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మీరు ఖర్చు పెట్టిన వందల కోట్లను వసూలు చేసుకోవడానికి లిక్కర్, ఇసుక ఇలా కనిపించింది కనిపించినట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పై రెక్కీ నిర్వహించడం నూటికి నూరు శాతం వాస్తవమని, దీనిపై త్వరలోనే డీజీపీని కలిసి, ఫిర్యాదు చేస్తామన్నారు.. దీనిపై ఏపీ మంత్రులు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఉరుకునేది లేదని శంకర్ గౌడ్ హెచ్చరించారు.