Minister Mallareddy IT Raids : మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు, రూ. 6 కోట్ల నగదు స్వాధీనం!
Minister Mallareddy IT Raids : మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో అక్రమాలు జరిగాయని ఐటీ అధికారులు గుర్తించారు. రెండు రోజులుగా జరుగుతున్న ఐటీ సోదాల్లో భారీగా నగదు సీజ్ చేశారు.
Minister Mallareddy IT Raids : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఐటీ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి. అనధికారికంగా లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి కోసం వెచ్చించినట్టు అధికారులు గుర్తించారు.
65 బృందాలు సోదాలు
రెండు రోజులుగా జరుగుతున్న సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేశారు. కొన్ని చోట్ల సోదాలు ముగిశాయి. మరికొన్ని చోట్ల రాత్రికి ముగిసే అవకాశముందని, ఇంకొన్ని చోట్ల రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువ కాకుండా తక్కువ చూపినట్టు.. ఆధారాలు సేకరించామని ఐటీ అధికారులు పేర్కొన్నారు. మల్లారెడ్డి వియ్యంకుడు వర్ధమాన కళాశాలలో డైరెక్టర్‌గా ఉండటంతో అక్కడ కూడా సోదాలు చేసినట్టు తెలుస్తోంది.
భారీగా నగదు స్వాధీనం
మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో ఇప్పటి వరకు రూ.6 కోట్లకు పైగా నగదు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్నటి ఐటీ సోదాల్లో రూ.4 కోట్ల 80 లక్షలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. త్రిశూల్ రెడ్డి నివాసంలో రూ.2 కోట్ల 80 లక్షలు, మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంటిలో రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మల్లారెడ్డి బామ్మర్ది కొడుకు సంతోష్ రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఐటీ శాఖ అధికారులు ఈ విషయం మీద స్పందిస్తూ మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ఇప్పటి వరకు చేసిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, గోల్డ్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గురువారం నాటికి సోదాలు ముగిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అన్నీ సరిగ్గానే ఉన్నాయి - మంత్రి మల్లారెడ్డి
అయితే ఈ దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ... తమ ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన అన్ని లెక్కలు, పత్రాలు సరిగ్గానే ఉన్నాయన్నారు. తన కళాశాలలు, ఆసుపత్రులు, ఆస్తుల వివరాలను ఐటీ అధికారులకు తెలియజేశామన్నారు. ఐటీ అధికారులు ఇంకా సోదాలు చేస్తున్నారని తెలిపారు. అన్ని అనుమతులతోనే కాలేజీలు, ఆసుపత్రులు నిర్వహిస్తున్నామన్నారు. తనకు, తన కుమారులకు ఈ సోదాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. గురువారం ఉదయానికి ఐటీ సోదాలు ముగిసే అవకాశముందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.