HCA Azharuddin : మ్యాచ్ నిర్వహణ అంటే అంత తేలికకాదు, జింఖానా ఘటనలో హెచ్సీఏ తప్పేం లేదు- అజారుద్దీన్
HCA Azharuddin : జింఖానా గ్రౌండ్ తోపులాట ఘటనపై హెచ్సీఏ తప్పిదం ఏంలేదని అజారుద్దీన్ అన్నారు. మ్యాచ్ నిర్వహణ అంటే అంత తేలికకాదన్నారు.
HCA Azharuddin : హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట వివాదాస్పదం అయింది. హెచ్సీఏ నిర్లక్ష్యం వల్లే టికెట్లకు అధిక సంఖ్యలో అభిమానులు వచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ ఘటనపై మంత్రి సమీక్ష నిర్వహించగా అక్కడకు వచ్చిన హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు సమాచారం. భారత్ -ఆసీస్ మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా మైదానంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో అభిమానులు, పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తోపులాట దురదృష్టకరమన్నారు. ఇందులో తమ తప్పు ఏంలేదని అజారుద్దీన్ అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. టికెట్ల వివరాలు శుక్రవారం మీడియాకు వెల్లడిస్తామన్నారు. మ్యాచ్ నిర్వహణ అంటే అంత తేలిక కాదని అజారుద్దీన్ చెప్పుకొచ్చారు.
నెగిటివ్ కోణంలో చూడొద్దు
జింఖానా మైదానంలో తోపులాటపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించిన సమీక్ష అనంతరం అజారుద్దీన్ మాట్లాడారు. హెచ్‌సీఏలో లోపాలుంటే సవరించుకుంటామన్నారు. తెలంగాణకు మరింత గౌరవం తెచ్చాలే హెచ్‌సీఏ చర్యలు ఉంటాయన్నారు. మ్యాచ్ నిర్వహణ అంత సులభం కాదని, కూర్చొని మాట్లాడుకునే అంత ఈజీ కాదన్నారు. అధ్యక్ష పదవిలో ఇవాళ తానున్నానని, రేపు మరొకరు ఉంటారని అజారుద్ధీన్ అన్నారు.తెలంగాణ ఖ్యాతి మరింత పెంచేందుకు పనిచేస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వంతో కలిసి మ్యా్చ్ ల నిర్వహణ ఉంటుందన్నారు. మ్యాచ్ నిర్వహణను ఎప్పుడూ నెగిటివ్ కోణం చూడొద్దని కోరారు. చాలా ఏళ్ల తర్వాత మ్యాచ్ నిర్వహణ అవకాశం వచ్చిందని అందుకు సంతోషంగా ఉన్నామన్నారు.
హెచ్సీఏ బోర్డు రద్దు చేయాలి-డీవైఎఫ్ఐ
సెప్టెంబర్ 25న ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లు జారీచేయడంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఘోర వైఫల్యం చెందిందని డివైఎఫ్ఐ ఆరోపించింది. గత పది రోజులుగా క్రీడాభిమానులకు క్రికెట్ టికెట్లపై హెచ్సీఏ స్పష్టత ఇవ్వకపోవడంతో ఉప్పల్ స్టేడియం, జింఖానా గ్రౌండ్ దగ్గర అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. మ్యాచ్ సమీపిస్తుండడంతో క్రీడాభిమానులు ఆందోళనలు చేయడంతో హెచ్సీఏ స్పందించి ఇవాళ క్రికెట్ మ్యాచ్ టికెట్లను జారీ చేస్తామని ప్రకటించింది. ఇవాళ టికెట్లు జారీ చేస్తారని పెద్ద ఎత్తున క్రీడాభిమానులు భారీ సంఖ్యలో క్యూ లైన్ లో నిలబడి ఎదురుచూస్తున్న తరుణంలో గంటలోనే టికెట్లు అయిపోయాయని చెప్పడంతో క్రీడాభిమానుల తోపులాటలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు పూర్తిగా హెచ్సీఏ బాధ్యత వహించాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. క్రీడాభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. హెచ్సీఏ ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ హెచ్సీఏ బోర్డు రాజీనామా చేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. పోలీసుల లాఠీ ఛార్జీలో గాయపడిన క్రీడాభిమానులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని, హెచ్సీఏ బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ డీవైఎఫ్ఐ నేతలు కోరారు.