Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత వాగ్మూలం నమోదు, ఏడు గంటలకు పైగా సీబీఐ విచారణ!
Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత వాగ్మూలాన్ని సీబీఐ అధికారులు నమోదు చేశారు.
Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణ ముగిసింది. కవితను సీబీఐ అధికారులు ఏడు గంటలు పైగా విచారించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ కవిత ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులు 7 గంటలు పైగా విచారణ చేసి వివరాలు సేకరించారు. సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద కవితను సాక్షిగా మాత్రమే విచారించి వాంగ్మూలం నమోదు చేసినట్టు తెలుస్తోంది.
ఈడీ రిమాండ్ రిపోర్టు ఆధారంగా విచారణ
ఎమ్మెల్సీ కవిత ఇంటికి ఆదివారం ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో సీబీఐ అధికారులు చేరుకున్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన పలు విషయాలను సీబీఐ విచారణ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సీబీఐ విచారణ కారణంగా కవిత నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొన్న విషయాలను సీబీఐ విచారణ సందర్భంగా కవిత వివరణ అడిగినట్లు సమాచారం. ఈ కేసులో సాక్షిగా మాత్రమే కవిత వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సీబీఐ విచారణ పూర్తయిందా? లేక మరోసారి కవితను విచారాస్తారా? అనే దానిపై సీబీఐ అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
దిల్లీ లిక్కర్ పాలసీలో కవిత పాత్ర ఆరా!
దిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆదివారం విచారించారు. దిల్లీ ఓబరాయ్ హోటల్ లో రూపొందిన లిక్కర్ పాలసీలో కవిత పాత్ర ఉందని, సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్ల డబ్బు తరలింపులో ఆమె భాగస్వామిగా ఉందని సీబీఐ ఆరోపిస్తుంది. అలాగే కవిత 10 మొబైల్స్ మార్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరుగురిని అరెస్ట్ చేశాయి దర్యాప్తు సంస్థలు. ఎమ్మెల్సీ కవితపై సీబీఐ అధికారుల ప్రశ్నల వర్షం కురించినట్లు తెలుస్తోంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలపై ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆరా తీశారు. ఇప్పటికే అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ కంట్రోలర్ గా కవిత ఉన్నారని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు ఇచ్చేందుకు రూ.100 కోట్లను విజయ్ నాయర్ కు అందినట్లు సీబీఐ, ఈడీ ఆరోపణలు చేస్తున్నాయి.
కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు
ఈ కేసులో అరెస్టయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో 160 సీఆర్పీసీ కింద సీబీఐ కవితకు నోటీసులను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన కవితను సీబీఐ అధికారులు విచారణ చేయాల్సి ఉంది. కానీ, ఇతర కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉండటంతో 11వ తేదీన అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాచారం ఇచ్చారు. కవిత ఇంటికి సీబీఐ అధికారులు రెండు టీమ్‌లుగా వచ్చారు. ప్రస్తుతానికి కవితను ఓ సాక్షిగా మాత్రమే విచారణ చేయనున్నారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్‌లో న్యాయ నిపుణులతో పాటు సీఎం కేసీఆర్ తో నోటీసులపై కవిత మాట్లాడారు. ఆయన కుమార్తెకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కవిత ఇంటి ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యోధుని కుమార్తె ఎప్పటికీ భయపడబోదనే అర్థం వచ్చేలా ‘డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్’ అని ఫ్లెక్సీలు పెట్టారు.
సీఎం కేసీఆర్ తో భేటీ
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణ ముగిసిన అనంతరం ఎమ్మెల్సీ కవిత నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత దాదాపుగా 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల తర్వాత ఈ భేటీ ముగిసింది. సీబీఐ విచారణ తీరును సీఎం కేసీఆర్‌కు కవిత వివరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రగతి భవన్ నుంచి తన ఇంటికి వెళ్లిపోయారు. సీబీఐ విచారణ తర్వాత ఎమ్మెల్సీ కవిత తన న్యాయవాదితో మాట్లాడారు.