Revanth Reddy : అదానీ-మోదీ చీకటి స్నేహం బయటపడుతుందనే రాహుల్ గాంధీపై వేటు- రేవంత్ రెడ్డి
Revanth Reddy : దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అదానీ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీపై వేటు వేశారని విమర్శించారు.
Revanth Reddy : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై వేటుపడింది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు గాను గుజరాత్ సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్ సభ సెక్రటరీ రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుంచి డిస్ క్వాలిఫై చేశారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అన్నారు. దేశ ఐక్యత - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. అదానీ - మోదీ చీకటి స్నేహంపై రాహుల్ గాంధీ నిలదీశారన్నారు. అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ పోరాటం చేయడం ప్రధాని మోదీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయన్నారు. ఈ కుట్రను న్యాయపోరాటం ద్వారా కాంగ్రెస్ ఛేదిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు.
— Revanth Reddy (@revanth_anumula) March 24, 2023
🔥దేశ ఐక్యత - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ “భారత్ జోడో యాత్ర” చేపట్టడం…
🔥అదానీ - మోడీ చీకటి స్నేహం పై నిలదీయడం.
🔥అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా పోరాటం చేయడం… pic.twitter.com/zKK7Nmitph
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
"అదానీ కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి, ఆ స్కామ్ పై చర్చ జరగకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీపై వేటు వేసింది. దేశంలో ఓ అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. దీనిని కాంగ్రెస్ ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు, రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశం ఉంది. ఈ సమావేశానికి నేను దిల్లీ వెళ్లాల్సిఉంది. కానీ పోలీసులు నిర్బంధించడం వల్ల నేను దిల్లీకి వెళ్లలేకపోయాను. చరిత్రలో నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు. ఎవరూ శాశ్వత అధికారాన్ని అనుభవించలేదు. "- రేవంత్ రెడ్డి
టీఎస్పీఎస్సీ లీకేజీపై
"టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై ఉస్మానియా వర్సిటీలో చేపట్టిన నిరసనకు హాజరుకాకుండా నన్ను నిర్బంధించారు. నా ఇంటి చుట్టూ మూడంచెల పోలీసుల భద్రత పెట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. నేను ఇక్కడ ఉండడం వల్ల నా ఇరుగుపొరుగు వాళ్లను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈ అక్రమ నిర్బంధం దుర్మార్గం. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటవిక చర్య. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను నిర్బంధించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ దారుణాలకు పాల్పడుతుంది. పరీక్షలకు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా చూస్తారు. ఒక నిమిషం లేటుగా వచ్చినా పరీక్షకు అనుమతించరు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించడానికి ఇంకెంత పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి. లాలాగూడలో ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు కేంద్రంగా ఉంది. ఈ కేంద్రంలో 578 మంది పరీక్షలు రాశారు. ఒంటిగంటలోపు పరీక్ష జరిగాలి కానీ 90 మంది అభ్యర్థులకు 1 గంట నుంచి 3.30 గంటల వరకూ పరీక్షలు రాయించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. ఇంత స్పష్టంగా పరీక్ష నిర్వహణలో లోపాలు జరిగాయని చెబితే సిట్ అధికారి శ్రీనివాస్ ఎందుకు వీటిపై విచారణ చేయలేదు." - రేవంత్ రెడ్డి