Mla Sridhar Babu : పోలీసులు మాకు మాకు అంతర్గత కలహాలు పెట్టడం సరికాదు - శ్రీధర్ బాబు
Mla Sridhar Babu : సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై పోలీసులు విచారణ చేపట్టాలని శ్రీధర్ బాబు అన్నారు. సీనియర్లను ఆధారాలు లేకుండా కోవర్టులు అనడం సరికాదన్నారు.
Mla Sridhar Babu : కాంగ్రెస్ లో సీనియర్ల అసమ్మతిపై ఆ పార్టీ సీనియర్ నేత శ్రీధర్ బాబు స్పందించారు. మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన... ఉత్తమ్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా అంశంపై ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ కవితపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే విచారణ జరిపారు కదా అదే విధంగా ఉత్తమ్ పై ప్రచారంపై ఫిర్యాదు చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేపై జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారంపై పోలీసులు విచారణ చేయాలన్నారు. పీసీసీతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి గురించి పోలీసులు విచారణ చేయాలన్నారు. పోలీసులు ప్రతిపక్ష నేతల మధ్య అంతర్గత కలహాలు పెట్టడం సరైంది కాదన్నారు. తప్పుఒప్పులు బయటకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సమస్య వస్తే సమన్వయం చేయాల్సిన బాధ్యత ఏఐసీసీపై ఉంటుందన్నారు.
ఆధారాలు లేకుండా కోవర్టులు అనడం సరికాదు
"పార్టీలో ఉండి సీనియర్లను ఆధారాలు లేకుండా కోవర్టులు అనడం తప్పు. అదే సీనియర్ కోవర్టు గిరి చేసినా తప్పే. పీసీసీ, సీఎల్పీ నాయకుల ప్రవర్తనను ఏఐసీసీ గమనిస్తోంది. కాంగ్రెస్ కోసం ఎవరేం చేశారో ఏఐసీసీ పిలిచి అడుగుతుందేమో. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్- బీజేపీ ఆడుతున్న నాటకం అనిపిస్తోంది. భట్టి ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు నన్ను కూడా పిలిచారు. కానీ నేను బిజీ వల్ల వెళ్లలేకపోయాను." - శ్రీధర్ బాబు
పీఏసీ సమావేశం
అసెంబ్లీలో అకౌంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. 10 నెలల తరువాత పీఏసీ సమావేశం నిర్వహించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. SC, ST మైనార్టీ అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగిందని శ్రీధర్ బాబు తెలిపారు. దళితబంధు స్కిమ్ వల్ల లాభం ఎంతో చెప్పాలని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. BC వెల్ఫేర్ , మున్సిపల్ శాఖపై కొద్దిగా చర్చ జరిగిందన్నారు. పేదలకు ప్రభుత్వ భూమి పంపిణీ అంశంపై చర్చించామన్నారు. ప్రతీ నెల జరగాల్సిన PAC భేటీ 10 నెలలు జరగకపోవడంపై శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
కాంగ్రెస్ సీనియర్ల అసమ్మతి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తిరుగుబాటు బావుటా ఎగురువేశారు. ఉత్తమ్ కుమర్ రెడ్డి దీనికి నేతృత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమైన సీనియర్లు రేవంత్ పేరు ఎత్తకుండానే తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని రక్షించుకునేందుకే ఒరిజనల్ కాంగ్రెస్ నేతలంతా సమావేశమయ్యామని ఉత్తమ్ చెప్పారు.కొత్త కమిటీల్లో బయటి పార్టీ నుంచి వచ్చినవాళ్లే ఎక్కువగా ఉన్నారన్న ఉత్తమ్... కావాలనే సోషల్ మీడియాలో తమను బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. తన వాళ్లే పదవుల్లో ఉండాలని తానెప్పుడూ భావించలేదన్నారు. కమిటీల్లోని 108 మందిలో 58 మంది తెలుగుదేశం పార్టీవాళ్లే ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్దరిస్తాడా? అని ప్రశ్నించారు. తాజా పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.