BRS Parliamentary Party Meet : దేశ ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు, పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయండి - సీఎం కేసీఆర్
BRS Parliamentary Party Meet : కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంట్ ఉభయ సభల్లో ఎండగట్టాలని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను దిశానిర్దేశం చేశారు.
BRS Parliamentary Party Meet :కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దురదృష్టకర విధానాలతో దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలని సీఎం కేసీఆర్... పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్ జరిగినన్ని రోజులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూ కేంద్రం చేస్తున్న తప్పులను దేశం దృష్టికి తీసుకురావాలని సీఎం అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామిక పంథాలో వీలైన అన్ని మార్గాలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ దిశగా బీఆర్ఎస్ పార్టీతో కలిసివచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కార్పొరేట్ శక్తులపై కేంద్రం ప్రేమ
ఆదివారం ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశం అనేక అంశాలను చర్చించారు. కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత, ప్రమాదకర విధానాల వల్ల దేశ భవిష్యత్తుకు తీరని నష్టం వాటిల్లుతుందని సమావేశంలో ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతకు, అభివృద్ధికి ఆటంకాలుగా మారాయని ఆరోపించారు. దేశ ప్రజలు తమ కష్టార్జితంతో కూడబెట్టుకుంటున్న సంపదనంతా అప్పనంగా తమ కార్పొరేట్ స్నేహితులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. తమకు అనుకూల కార్పొరేట్ శక్తుల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రేమ కురిపిస్తూ లక్షలాది కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తుందన్నారు. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అదానీ వంటి బడా వ్యాపారవేత్తలకు వాటాలను అప్పనంగా కట్టబెట్టిందని ఆరోపించారు. వారి కంపెనీల డొల్లతనం బయటపడితే షేర్ల విలువ హఠాత్తుగా పడిపోయిందని, లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజులోనే నష్టపోతున్న వాస్తవాన్ని దేశం గమనిస్తుందని కేసీఆర్ అన్నారు.
రాష్ట్రాల అభివృద్ధికి అడ్డంకులు
ఇలాంటి ఆర్థిక అవకతవకలకు దోహదం చేసే విధంగా దేశ సంపదనంతా ప్రైవేట్ పరం చేస్తూ కేంద్రం తీరని నష్టం చేస్తుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. లాభాలను ప్రైవేట్ పరం చేస్తూ...నష్టాలను దేశ ప్రజల మీద రుద్దుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర ఆర్ధిక విధానాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో గొంతెత్తాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. దేశ ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా ఖండించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. దీనిపై పార్లమెంట్ లో నిలదీయాలన్నారు. ప్రగతి పథంలో నడుస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రానికి ఆర్థికంగా అనేక రకాలుగా ఆటంకాలు సృష్టిస్తూ ప్రగతిని అడ్డుకుంటున్న కారణమేందో జాతికి చెప్పాలని కేంద్రాన్ని నిలదీయాల్సి ఉందన్నారు. అక్కడితో ఆగకుండా గవర్నర్ల వ్యవస్థను కూడా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రాలను నిర్వీర్యం చేసే దిశగా గవర్నర్లను కేంద్రం తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడం అప్రజాస్వామికం అన్నారు.
గవర్నర్ వ్యవస్థను స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు
రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తిస్తూ కేంద్ర రాష్ట్రాల మధ్య సంధాన కర్తలుగా ఉండాల్సిన గవర్నర్ల వ్యవస్థను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న విధానాలను బీర్ఎస్ ఎంపీలుగా ఉభయ సభల్లో తీవ్రంగా వ్యతిరేకించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర కేబినెట్ సహా, అత్యున్నత సభలైన శాసన సభ, శాసన మండలి తీసుకున్న నిర్ణయాలను ఉద్దేశపూర్వకంగా పెండింగులో పెడుతూ గవర్నర్లు బేఖాతరు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రభావితం చేయాలని, అభివృద్ధిని, పాలనను అడ్డుకోవాలని చూస్తున్న గవర్నర్ల అప్రజాస్వామిక విధానాలను, కేంద్రం వైఖరిని పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టాలన్నారు. దేశ భవిష్యత్తు కోసం, ప్రజా సమస్యల మీద పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం మీద పోరాటానికి కలిసివచ్చే ప్రతిఒక్క పార్టీ ఎంపీని కలుపుకుని పోవాలన్నారు. పెట్రోల్, డీజిల్ సహా వంటగ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, సామాన్యుడి బతుకు పెరుగుతున్న ధరలతో రోజు రోజుకూ భారమైపోతున్నా కేంద్రానికి ఏమాత్రం పట్టింపులేదని ఆరోపించారు.