Nirmala Sitharaman : హైదరాబాద్ పన్నులు హైదరాబాద్ లోనే ఖర్చుపెడుతున్నారా?, రాజీనామా ఎవరు చేయాలో ప్రజలే డిసైడ్ చేస్తారు - నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలంగాణ మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని నిర్మలా సీతారామన్ అన్నారు. మంత్రి హరీష్ రావు రాజీనామా సవాల్ పై ప్రజలే సమాధానం చెప్తారన్నారు.
Nirmala Sitharaman : తెలంగాణ మంత్రులు తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పార్లమెంట్ ప్రవాస్ పేరుతో బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ వచ్చానన్నారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈ పర్యటనలో బీజేపీ కార్యకర్తలతో మాట్లాడడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చానన్నారు. మూడ్రోజుల పాటు పర్యటించేందుకు వచ్చిన తనకు మంచి అనుభవాలు ఎదురయ్యాయన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలతో చూస్తే చాలా ఇన్సిరేషన్ గా అనిపించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులు, ఇతర వర్గాల వారికి ఏంచేస్తుందని వారికి తెలియజేశామన్నారు.
రాష్ట్రాలే లేట్ చేస్తున్నాయ్
"ప్రతి పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వాటాలు ఉంటాయి. ట్యాక్స్ పేయర్ కట్టిన ప్రతీ పైసాను ఏ పథకానికి వెళ్లాలో అన్నీ కేంద్రం డిజిటలైజ్ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో పథకాలు అమలుచేస్తు్న్నాం. కేంద్రమే ముందుగా పథకాలకు నగదు చెల్లిస్తుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి వాటా పెట్టడంలేదు. అందుకే కొన్ని ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తున్నా మా పేరు పెట్టడానికి అభ్యంతరం ఏంటి? మా వాటా ఎంత ఉన్నా కానీ కేంద్రం పేరు పెట్టరు. కేంద్ర పథకాల పేర్లు మార్చేసి రాష్ట్రాల పేర్లు పెట్టుకుంటున్నారు. తెలంగాణలో 50-55 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఆదిలాబాద్ లో ప్రాజెక్టు కేటాయిస్తున్నారు కదా మరీ హైదరాబాద్ వాళ్ల పేరుతో ప్రాజెక్టు నడుపుతారా? ఇక్కడ ఎంపీ ఫొటో పెట్టి నడుపుతారా?. ఎవరు ప్రశ్న అడిగినా అది ప్రజలకు చెప్పాల్సిన సమాధానం. కానీ దానిపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు." - నిర్మలా సీతారామన్
రాజీనామాపై నిర్మలమ్మ కౌంటర్
ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణలో చేరలేదని తాను చెప్పలేదని నిర్మలా సీతారామన్ అన్నారు. మే 2021 వరకు తెలంగాణ చేరలేదని చెప్పానన్నారు. అప్పటి వరకూ తెలంగాణ ఆయుష్మాన్ భారత్ లో ఎందుకు చేరలేదని ప్రశ్నించానన్నారు. రాజీనామా అంటూ సవాల్ చేస్తున్నారని, ప్రజలు అన్నీ చూస్తున్నారని వాళ్లే సమాధానం చెప్తారన్నారు. ప్రజాప్రతినిధిగా కలెక్టర్ ను రేషన్ షాపు వద్ద ప్రశ్నించానని నిర్మలా సీతారామన్ అన్నారు. తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. కలెక్టర్ ను కేంద్రం వాటా ఎంతో తెలియదా? అని ప్రశ్నించానన్నారు. తెలుసుకుని చెప్పాలని ఆయనకు అరగంట సమయం కూడా ఇచ్చానన్నారు.
కాళేశ్వరానికి నిర్థిష్టమైన డీపీఆర్ లేదు
మేమింత ట్యాక్స్ కడుతున్నాం, తిరిగి అంతా ఇవ్వాలంటున్న వ్యాఖ్యలకు అర్థం లేదన్నారు. అది ట్యాక్సేషన్ ప్రిన్సిపల్ కాదన్నారు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు కేటాయింపులు ఉంటాయన్నారు. రాష్ట్రాలకు ముందుగానే నిధులు కేటాయిస్తున్నామన్నారు. అందుకే హైదరాబాద్ , ఆదిలాబాద్ ఉదాహరణ చెప్పానన్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న పన్నులను హైదరాబాద్ లోనే ఖర్చుపెడుతున్నారా? అని ప్రశ్నించారు. అవి అర్థంలేని వ్యాఖ్యలని నిర్మలా సీతారామన్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నిర్థిష్ట డీపీఆర్ లేదన్నారు. ఈ ప్రాజెక్టు వాటర్ పంపుల నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువన్నారు. అప్పు తీసుకుని ఈ ప్రాజెక్టును నడుపుతున్నారని, దీంతో తెలంగాణలోని ప్రతి ఒక్కరిపై ఆ అప్పు పడుతుందన్నారు. ఒక ఆర్టీఐలో వచ్చిన సమాధానం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు 8-9 శాతం వడ్డీ చెల్లిస్తున్నారన్నారు.
Also Read : MIM Telangana : సెప్టెంబర్ 17 రాజకీయాన్ని తేల్చేసిన మజ్లిస్ - తాము కూడా నిర్వహిస్తామన్న ఓవైసీ !